Supreme Court | అలా.. పుట్టిన పిల్లలకూ ఆస్తిలో వాటా: సుప్రీం

వారసత్వ ఆస్తిలోనూ వాటా ఇవ్వాలి 2011 నాటి కేసులో సుప్రీంకోర్టు తీర్పు Supreme Court | న్యూఢిల్లీ: చెల్లుబాటు కాని వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు హిందూ చట్టాలను అనుసరించి తమ తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉన్నదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. వివాహేతర బంధాలతో పుట్టిన పిల్లలకు తమ తల్లిదండ్రులకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో వాటా లేదా సమభాగం ఉంటుందా? లేదా? అన్న అంశంలో 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఒక కేసులో […]

  • By: Somu    latest    Sep 01, 2023 10:36 AM IST
Supreme Court | అలా.. పుట్టిన పిల్లలకూ ఆస్తిలో వాటా: సుప్రీం
  • వారసత్వ ఆస్తిలోనూ వాటా ఇవ్వాలి
  • 2011 నాటి కేసులో సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court |

న్యూఢిల్లీ: చెల్లుబాటు కాని వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు హిందూ చట్టాలను అనుసరించి తమ తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉన్నదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. వివాహేతర బంధాలతో పుట్టిన పిల్లలకు తమ తల్లిదండ్రులకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో వాటా లేదా సమభాగం ఉంటుందా? లేదా? అన్న అంశంలో 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఒక కేసులో ఈ తీర్పు వెలువరించింది.

ఈ విషయంలో గత నెలలో పలువురు న్యాయవాదుల వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విన్నది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 16(3) ప్రకారం సదరు పిల్లలకు ఆస్తి హక్కును తమ తల్లిదండ్రుల స్వార్జితం వరకూ పరిమితం చేయాలా? అనే అంశంలోనూ అభిప్రాయాలు తీసుకున్నది. వీటన్నింటినీ 2011 మార్చి 31న ఇద్దరు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం విస్తృతస్థాయి ధర్మాసనానికి నివేదించింది.

దీనిపై వాదనలను నమోదు చేసుకున్న విస్తృతస్థాయి ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. తీర్పును చదివిన ప్రధాన న్యాయమూర్తి.. ఒక వ్యక్తి చనిపోవడానికి ముందు పూర్వీకుల ఆస్తి పంపకం జరిగి ఉంటే.. అతని వారసులతోపాటు.. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 16 కింద చట్టబద్ధత పొందిన పిల్లలకు వాటా ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధం కాని వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు వారి ఆస్తిలో వాటా కోరే హక్కు లేదన్న గత కోర్టు అభిప్రాయంతో విస్తృత ధర్మాసనం ఏకీభవించలేదు.

కాగా.. సమాజం మారుతున్నదన్న ధర్మాసనం.. ఒకప్పుడు చట్టబద్ధం కాదు అనుకున్నవి ఇప్పుడు చట్టబద్ధం అవుతున్నాయని గుర్తుచేసింది. చట్టబద్ధత అనే భావన సామాజిక ఏకాభిప్రాయం నుంచి ఉద్భవించిందని పేర్కొన్నది. దీనికి రూపకల్పన చేయడంలో వివిధ సామాజిక గ్రూపులు కీలకంగా వ్యవహరించాయని పేర్కొన్నది. మారుతున్న కాలంలో చట్టం కూడా స్థిరంగా ఉండజాలదని తెలిపింది.