ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌దే గెలుపు.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ తాజా ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడి

ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌దే గెలుపు.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ
తాజా ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడి
  • ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిన సర్వేలు
  • బీజేపీకి 2024 అంత ఈజీకాదు!



ఛత్తీస్‌గఢ్‌ మొత్తం స్థానాలు 90

కాంగ్రెస్‌ 51

బీజేపీ 23

ఇతరులు 1


రాజస్థాన్‌

కాంగ్రెస్‌ 91-101

బీజేపీ 95-105


మధ్యప్రదేశ్‌

బీజేపీ 102-110

కాంగ్రెస్‌ 118-128

ఇతరులు 0-2


న్యూఢిల్లీ : రాబోయే పార్లమెంటు ఎన్నికలకు డ్రెస్‌ రిహార్సల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గడ్డు కాలం దాపురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే 2024 ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ పాలిస్తున్న మధ్యప్రదేశ్‌ ఈసారి ఆ పార్టీ చేజారిపోయే అవకాశాలున్నాయని తాజా సర్వేలు పేర్కొంటున్నాయి.


మరో కీలక రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ మరోసారి జయకేతనం ఎగురవేస్తుందని తేలింది. రాజస్థాన్‌లో హోరాహోరీ పోరు నెలకొంటుందని సర్వేల్లో వెల్లడైంది. తెలంగాణలో బీజేపీకి అవకాశాలు లేవని ఇప్పటికే అనేక సర్వేలు తేల్చిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో ఇండియా టుడే- సీవోటర్‌ నిర్వహించిన సర్వేలో.. మొత్తం 90 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 51 స్థానాలు గెల్చుకుంటుందని వెల్లడైంది.


ఓటు షేర్‌ విషయానికి వస్తే.. కాంగ్రెస్‌ గత ఎన్నికల కంటే 2 శాతం ఓటింగ్‌ పెంచుకుని 46శాతం ఓట్లు సాధిస్తుందని పేర్కొన్నది. అదే సమయంలో బీజేపీ కూడా గణనీయంగా ఓటు షేరు పెంచుకుంటుందని వెల్లడైంది. బీజేపీకి గత ఎన్నికలతో పోల్చితే.. 8శాతం అదనంగా పెరిగి.. 41 శాతానికి పెరుగుతుందని పేర్కొంది.


ఇతరులకు మొత్తంగా 11 శాతం తగ్గి, 13 శాతం ఓట్లు వస్తాయిని తెలిపింది. సీట్ల విషయానికి వస్తే.. కాంగ్రెస్‌కు గత ఎన్నికల కంటే 17 సీట్లు తగ్గి, 51 దగ్గర నిలవొచ్చని సర్వేలో వెల్లడైంది. బీజేపీ 23 సీట్లు పెంచుకుని 38 స్థానాల వద్ద ఆగుతుందని పేర్కొన్నది. ఇతరులకు గత ఎన్నికలతో పోల్చితే ఆరు సీట్లు తగ్గి ఒకటే వస్తుందని తెలిపింది. సీట్లు / ఓట్లలో ఇతర పార్టీల నుంచే రెండు పార్టీలు లాభపడతాయని పేర్కొన్నది.


గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 68 సీట్లలో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీ సైతం 24% ఓట్లు తెచ్చుకున్నది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య 10% తేడా.. కాంగ్రెస్‌కు అత్యధిక మెజార్టీని కట్టబెట్టింది. ఈసారి సీట్లు తగ్గినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నదని సర్వే తెలిపింది.


రాజస్థాన్‌లో పోటాపోటీ


కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ఈసారి హోరాహోరీగా ఎన్నికల పోరు సాగనున్నదని టైమ్స్‌ నౌ నవభారత్‌ ఒపీనియన్‌ పోల్‌ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 91 నుంచి 101 స్థానాలు లభిస్తాయని, బీజేపీ 95 నుంచి 105 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఇతరులకు మూడు నుంచి ఐదు సీట్లు లభిస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 42.8శాతం ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది.


ఓటు షేర్‌ విషయంలో బీజేపీకంటే కాంగ్రెస్‌ కేవలం 0.6 శాతం తేడాతోనే ఉన్నదని, ఇది హోరా హోరీ ఎన్నికకు సంకేతమని పేర్కొన్నది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజామన్నన పొందుతున్నాయని, మరోసారి ఆయనే ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల కోరికని తెలిపింది. రెండు నెలల క్రితం నిర్వహించిన సర్వేతో పోల్చితే.. కాంగ్రెస్‌కు తాజా సర్వేలో 20 సీట్లు పెరిగాయని పేర్కొన్నది. ఈ పెరుగుదల కొనసాగితే.. బొటాబొటీ మెజార్టీతోనైనా కాంగ్రెస్‌ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.


ప్రాంతాలవారీగా చూస్తే


ధుబ్ధార్‌ ప్రాంతంలో బీజేపీకి 27 నుంచి 29 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని, కాంగ్రెస్‌ 28 నుంచి 30 సీట్లు గెలిచే పరిస్థితి ఉన్నదని సర్వే తెలిపింది. మార్వార్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీ మెరుగైన స్థితిలో కనిపిస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్‌కు 27 నుంచి 29 మధ్య సీట్లు లభించే అవకాశం ఉంటే.. బీజేపీకి 30-32 మధ్య లభించే అవకాశం ఉంది. మేవార్‌ ప్రాంతంలో రెండు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంటుందని సర్వే అంచనా వేసింది. హదోటి ప్రాంతంలో బీజేపీకి 8-10 మధ్య, కాంగ్రెస్‌కు 7-9 మధ్య సీట్లు లభించవచ్చని సర్వే లెక్కలను బట్టి తెలుస్తున్నది. షెకావతీ ప్రాంతంలో బీజేపీకి పది నుంచి 12 స్థానాలు లభిస్తే.. కాంగ్రెస్‌ 9-11 మధ్య గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది.


మధ్యప్రదేశ్‌లో గట్టిపోటీ.. కాంగ్రెస్‌కే మొగ్గు!


మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఢీ అంటే ఢీ అనే పద్ధతుల్లో పోరు కొనసాగనున్నదని టైమ్స్‌ నౌ నవభారత్‌ ఈటీజీ సర్వే తెలిపింది. ఇక్కడ రెండు పార్టీలకూ ఓటు షేరు 42.8 శాతం చొప్పున ఉండటం విశేషం. దీని ప్రకారం బీజేపీ 102 నుంచి 110 మధ్య స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నది. కాంగ్రెస్‌కు 118 నుంచి 128 మధ్య సీట్లు లభిస్తాయని సర్వే పేర్కొంటున్నది. ఇతర పార్టీలు 13.40 శాతం ఓటింగ్‌తో గరిష్ఠంగా రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నదని తెలిపింది.


గ్వాలియర్‌ చంబల్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ స్వీప్‌ చేస్తుందని ఇక్కడ ఆ పార్టీకి 30 స్థానాలు వస్తాయని, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా ఈ ప్రాంతానికి చెందినవారే. జూలై నెలలో నిర్వహించిన సర్వేకంటే తాజా సర్వేలో కాంగ్రెస్‌ సీట్లు పెరగడం విశేషం. జూలై సర్వేలో బీజేపీకి 105-115 వస్తాయని పేర్కొంటే.. తాజా సర్వేలో ఆ సంఖ్య 102-110కి తగ్గింది. అదే కాంగ్రెస్‌ విషయంలో.. 114-124 నుంచి 118-128కి పెరగడం గమనార్హం.


మాల్వా నిమర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 41-45 మధ్య సీట్లు లభించే అవకాశం ఉన్నది. బీజేపీకి 20-24 మధ్య రావచ్చు. మహాకౌశల్‌ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం కనబర్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి 18-22 మధ్య, కాంగ్రెస్‌కు 16-20 మధ్య స్థానాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది. మధ్యభారత్‌లో బీజేపీ కాంగ్రెస్‌ కంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఇక్కడ బీజేపీకి 22-24 మధ్య, కాంగ్రెస్‌కు 12-14 మధ్య సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వింధ్య ప్రాంతంలో బీజేపీకి 19-21 మధ్య, కాంగ్రెస్‌కు 8-10 మధ్య సీట్లు రావొచ్చు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో బీజేపీకి 13-15 మధ్య, కాంగ్రెస్‌కు 11-13 మధ్య సీట్లు లభించే అవకాశం ఉన్నదని సర్వే తెలిపింది.