ఈటలంటే KTRకు అభిమానం ఇందుకేనా?

రాజకీయవర్గాల్లో కేటీఆర్‌-ఈటల సంభాషణపై చర్చ విధాత: నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ బీజేపీ ఎమ్మెల్యేలతో ముఖ్యంగా ఈటల రాజేందర్‌తో చేసిన సంభాషణ చర్చనీయాంశమైంది. ఈటల బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయనపై కేటీఆర్ ఎన్నడూ తీవ్ర విమర్శలు చేయలేదు. ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆయన దూరంగానే ఉన్నారు. నిజానికి ఈటలను వదులుకోవడం కేటీఆర్‌కు ఇష్టం లేదనే వాదన ఉప ఎన్నిక సందర్భంగా వినిపించింది. బీజేపీలో వారికి స్వేచ్ఛ ఏది? గత అసెంబ్లీ ఎన్నికల్లో […]

ఈటలంటే KTRకు అభిమానం ఇందుకేనా?
  • రాజకీయవర్గాల్లో కేటీఆర్‌-ఈటల సంభాషణపై చర్చ

విధాత: నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ బీజేపీ ఎమ్మెల్యేలతో ముఖ్యంగా ఈటల రాజేందర్‌తో చేసిన సంభాషణ చర్చనీయాంశమైంది. ఈటల బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయనపై కేటీఆర్ ఎన్నడూ తీవ్ర విమర్శలు చేయలేదు. ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆయన దూరంగానే ఉన్నారు. నిజానికి ఈటలను వదులుకోవడం కేటీఆర్‌కు ఇష్టం లేదనే వాదన ఉప ఎన్నిక సందర్భంగా వినిపించింది.

బీజేపీలో వారికి స్వేచ్ఛ ఏది?

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న ఒకే ఒక సీటు గోషామహల్‌. అక్కడ ఉత్తరాదివారు ఎక్కువగా ఉంటారు. వారిలో బీజేపీ భావజాలం ఉంటుందని, అందుకే రాజాసింగ్‌ అక్కడ గెలిచారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

దుబ్బాక, హుజురాబాద్‌లో గెలిచిన రఘునందన్‌, రాజేందర్‌లకు ఉద్యమకాలం నుంచి అన్నివర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే వారు పోటీ చేసినా వారిని బీజేపీ అభ్యర్థులుగా కాకుండా తెలంగాణవాదులుగానే ప్రజలు చూశారని అంటారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంతో విభేదించి, వారు బీజేపీ గూటికి చేరినా.. ఆ పార్టీలో స్వేచ్ఛగా పని చేయలేక పోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతున్నది.

ఈటలకు బీజేపీలో దక్కని ప్రాధాన్యం

బీజేపీలో చేరిన ఈటలకు అక్కడ అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని విపక్ష నేతలతో పాటు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దానికి అనుగుణంగానే గతంలో బీజేపీలో చేరి, తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య, దాసోజు శ్రవణ్‌, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌లు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అధికారపార్టీలో టికెట్‌ ఆశించి భంగపడినవారు, పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తితో బీఆర్‌ఎస్‌ను వీడి, బీజేపీలో చేరిన వారికి చేదు అనుభవాలే ఎదురవుతున్నట్టు సమాచారం.

ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొన్ని నెలల కిందట నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. కానీ.. టికెట్లు ఆశించవద్దని, పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని, పార్టీ పనితీరు ఆధారంగానే పదవులు దక్కుతాయని వారు కూడా కుండబద్దలు కొట్టారు. దీంతో బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ను కాదనుకుని కాషాయ తీర్థం పుచ్చుకున్న వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

అంతర్గత కుమ్ములాటలు

బండి సంజయ్‌ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కలుపుకొని పోవడం లేదని, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలో ఈటల లాంటి వాళ్లకు ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. హుజురాబాద్‌ నియోజకవర్గం కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోనే ఉన్నది.

అక్కడ రాజేందర్‌ను ఢీకొని, నెగ్గగల నాయకులు ఎవరూ లేరు. ఉప ఎన్నికకు ముందు బీఆర్‌ఎస్‌లోకి వివిధ పార్టీల నేతలను చేర్చుకున్నా.. దళితబంధు లాంటి పథకాన్ని ఆ నియోజకవర్గంలో పూర్తిగా అమలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో నియోజకవర్గ ప్రజలతో, ప్రజాసంఘాల నాయకులతో, ఇతర పార్టీల నేతలతో ఈటలకు ఉన్నఅనుబంధం ముందు ప్రభుత్వం ఎంత బలప్రదర్శన చేసినా గెలవలేకపోయింది.

ఇదీ సంగతి..

అందుకే ఈటలపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేయడం లేదని, ఆయనతో అవకాశం ఉన్నప్పుడల్లా సరదాగా సంభాషిస్తున్నారనే టాక్‌ ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్నది. రాజేందర్‌ కూడా బీజేపీ సిద్ధాంతాలతో రాజీ పడలేక, ఆ పార్టీ విధానాలను బలంగా చెప్పలేక పోతున్నారు. అసెంబ్లీలో ఈటల, కేటీఆర్‌ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ విన్నవాళ్లు ఈటల తిరిగి గులాబీ గూటికి చేరుతారా? ఆయనపై కేటీఆర్‌ అభిమానం అందుకేనా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు