BRSను సాగనంపాల్సిన సమయమొచ్చింది: రేవంత్ రెడ్డి
నలుగురి కోసం 4కోట్ల మంది ప్రయోజనాలు బలి రియల్టర్‌ను ఎమ్మెల్యే చేస్తే కబ్జాలు చేస్తారు వర్ధన్నపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యుల ప్రయోజనం చేకూర్చేదిగా మార్చివేశారని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోడో పాదయాత్రలో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని […]

- నలుగురి కోసం 4కోట్ల మంది ప్రయోజనాలు బలి
- రియల్టర్‌ను ఎమ్మెల్యే చేస్తే కబ్జాలు చేస్తారు
- వర్ధన్నపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యుల ప్రయోజనం చేకూర్చేదిగా మార్చివేశారని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోడో పాదయాత్రలో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో పాదయాత్ర నిర్వహించారు. అయినవోలు నుంచి వర్ధన్నపేట సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. మధ్యలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, యువకుల బలిదానాలను చూడలేక సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.
కోట్లాది మంది ప్రజల ప్రయోజనాన్ని ఆశించి ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో చేస్తారనే ఆశతో ప్రజలు టిఆర్ఎస్‌కు అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు.
దళితులకు మూడెకరాల భూమి పంచుతానని చెప్పి అమలు చేయలేదని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఉద్యోగాలు, కేజీ టు పీజీ విద్య, రైతులకు రుణమాఫీ, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంపు, అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఏ హామీ అమలు కాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో సంక్షేమం
అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయం గుర్తు చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
రియల్టర్లను ఎమ్మెల్యే చేస్తే భూకబ్జా
వర్ధన్నపేట నియోజకవర్గంలో దళితుడిని ఎమ్మెల్యే చేస్తే దళితవాడలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళిత బంధు పథకం తన అనుచరులకు ఇప్పించుకుంటున్నారని అందులో కూడా 30% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తే ప్రజల భూములు గుంజుకొని అందులో రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు లాక్కోవాలని ప్రయత్నించారని విమర్శించారు.
పెరుమాండ్ల గూడెంలో ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తే వారిని అక్రమంగా నిర్బంధించారు. 12 మందిపై అక్రమ కేసు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్లో చిత్రహింసల పాలు చేశారని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ చేసే వారికి ఓటేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని, భూకబ్జాదారులంతా, ఆఖరికి రేపిస్టులు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా మారారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి దుష్ట ప్రభుత్వాన్ని పంపించేందుకు సిద్ధం కావాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పాటు ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్నర్ మీటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల రాజయ్య, నమిండ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రసంగించారు. సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.