తిరుమ‌ల: స్వామి వారి గ‌జ‌రాజుల గురించి మీకు తెలుసా..!

వాహ‌న‌ సేవల కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ కేర‌ళ నుంచి నిపుణుల రాక‌ శ్రీ‌నిధికి 14 ఏళ్లు, ల‌క్ష్మీకి 45 ఏళ్లు మరింత అభివృద్ధి దిశ‌గా తిరుమల గోశాల విధాత‌, తిరుమ‌ల‌: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి. గ‌రంగ వైభ‌వం జ‌రిగే ఈ బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలది కీలక పాత్ర. స్వామి వారి వాహన సేవల్లో తొలి అడుగు ఈ జంతువులదే. ఇవే భక్తులకు ముందుగా […]

తిరుమ‌ల: స్వామి వారి గ‌జ‌రాజుల గురించి మీకు తెలుసా..!
  • వాహ‌న‌ సేవల కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ
  • కేర‌ళ నుంచి నిపుణుల రాక‌
  • శ్రీ‌నిధికి 14 ఏళ్లు, ల‌క్ష్మీకి 45 ఏళ్లు
  • మరింత అభివృద్ధి దిశ‌గా తిరుమల గోశాల

విధాత‌, తిరుమ‌ల‌: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి. గ‌రంగ వైభ‌వం జ‌రిగే ఈ బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలది కీలక పాత్ర. స్వామి వారి వాహన సేవల్లో తొలి అడుగు ఈ జంతువులదే.

ఇవే భక్తులకు ముందుగా కనువిందు చేస్తాయి. సర్వాంగసుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామి వారు వస్తున్నారన్న సంకేతం ఇస్తాయి. బ్రహ్మోత్సవాలకు అట్టహాసంగా తీసుకు వస్తున్న ఘనత వీటికే దక్కుతుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ జంతువుల ఆలనా పాలనా చూస్తూ సంరక్షిస్తారు.

లక్ష్మీ నుంచి శ్రీనిధి వరకు

గజం ఐశ్వర్యానికి చిహ్నం. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీ లక్ష్మీదేవి ఇష్టవాహనం కూడా ఏనుగే. శ్రీమహా విష్ణువు అవతారమైన శ్రీవేంకట్వేరుని వైభవాన్ని సిరిసంపదలకు సూచికలైన ఏనుగులు ఇతర జంతువు లైన గుర్రాలు, వృషభాలతో కలిసి మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గజాల్లో 14 ఏళ్ల శ్రీనిధి అన్నిటికంటే చిన్నది. 45 ఏళ్ల లక్ష్మీ అన్నిటి కంటే పెద్దది.

ఏనుగుల సంరక్షణ చూస్తున్న ఎస్వీ గో సంరక్షణశాల సంచాలకులు డాక్ట‌ర్‌ హరనాథరెడ్డి మాట్లాడుతూ.. హార్మోన్లు విడుదల సమయంలో మగ ఏనుగులను అదుపు చేయడం కష్టతరమని, ఈ కారణంగా వాటిని ఉంచడం లేదని తెలిపారు. ఉన్న ఏనుగులకు ప్రతీ రోజు ఆలయాల ఉత్సవ సేవలలో, గోశాలలో నడక ద్వారా వ్యాయామం, శరీర మర్దన చేయటం జరుగుతుంద‌న్నారు. ప్రతి అరగంటకు ఒకసారి ఏనుగులకు ఆహారం అందించడంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

ఆలయ మాడవీధుల్లో వాహనసేవల సమయంలో శక్తివంతమైన విద్యుత్‌దీపాల వెలుగులు, కళాకారుల వాయిద్యాల శబ్దం నుంచి ఏనుగులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని రోజుల ముందు నుంచి పలురకాలుగా మచ్చిక చేసుకుని వీటిని బ్రహ్మోత్సవాలకు సమాయత్తం చేస్తామ‌న్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి చెరుకుగడలు, నేపియర్‌ గ్రాసం అందిస్తామన్నారు.

కేర‌ళ నుంచి వైద్య నిపుణుల రాక‌:

బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ కూడా ఇస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం(ముల్లు కట్టె), గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు. జంతువులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. జంతువుల వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని సంఘటనలు జరిగినపుడు జంతువులను నియంత్రించేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.

మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా రూపొందించడం విశేషం. ఏనుగులను అదుపు చేసేందుకు కేరళ నుంచి నిపుణులైన‌ పశువైద్యులను రప్పిస్తారు. వాహనసేవల్లో పాల్గొనే జంతువులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గజరాజులను ముఖపట్టాతోపాటు రంగురంగుల బొంతలతో అలంకరిస్తారు. మావటిలు గొడుగులు, విసనకర్రలతో స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు.

గరుడసేవ నాడు ప్రత్యేకంగా అలంకరిస్తారు. అశ్వాలు రాజసానికి చిహ్నాలు. వీటిని ముఖపట్టా, తలపై కుచ్చు, బొంతలు, మెడగజ్జలు, కాళ్లపట్టీలతో అలంకరిస్తారు. రైతన్నలకు నేస్తాలైన ధర్మానికి ప్రతీకగా నిలిచే వృషభాలను మెడలో నల్లతాడు, పూలహారాలు, గజ్జలు, బొంతలతో అలంకరిస్తారు. వాహన సేవల్లో ఈ జంతువులకు ఇష్టమైన రావి ఆకులు, మర్రి ఆకులు, రాగి సంకటి, చెరకు గడలను ఆహారంగా ఇస్తారు. మాడ వీధుల్లో తిరిగే సమయంలో క్రమం తప్పకుండా ఆహారాన్ని, ఆలయం వద్ద నీటిని అందిస్తూ ఉంటారు.

తిరుమలలో గోశాల మరింత అభివృద్ధి

తిరుమ‌లలోని ఎస్వీ గోశాల‌లో పాడి ఆవులు, లేగ దూడలు, మేలురకం ఎద్దుల‌తో కలిపి మొత్తం 45 గోవులున్నాయి. గోశాలకు ఆనుకుని ఉన్న సుమారు 8 ఎకరాల స్థలాన్ని చదును చేసి గోవులు తిరిగేందుకు అనువుగా మారుస్తున్నారు. సుమారు 100 గోవులు ఉంచేందుకు వీలుగా షెడ్డు నిర్మించ‌నున్నారు. శ్రీ‌వారి తోమాలసేవ, అభిషేకం, ఏకాంత సేవ, నవనీత సేవ కోసం పాలు, పెరుగు, వెన్న తదితర పదార్థాలను ఇక్క‌డినుంచే తీసుకెళ‌తారు. మజ్జిగను అన్నదానం కాంప్లెక్స్‌కు సరఫరా చేస్తారు.