INDIA
విధాతః విపక్షాల కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇంక్లూజివ్ అలయెన్స్(INDIA) తొలి పార్లమెంటరీ సమావేశం రేపు గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో జరగనుంది. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుండి ప్రారంభంకానున్న నేపధ్యంలో సమావేశాల్లో ఇండియా భాగస్వామ్య పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఇండియా కూటమి చేయనున్న తొలి ఐక్య పోరుకు పార్లమెంటు వేదిక కానుంది.
దీంతో ఈ సమావేశాలను ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై అధికారా పక్షాన్ని నిలదీసేలా కార్యాఛరణ రూపొందించనున్నాయి. త్వరలోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు కేంద్రం సిద్ధమవుతున్న నేపధ్యంలో వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్షాలు రెండు కూడా పరస్పరం విమర్శల దాడికి పదను పెడుతున్నాయి.
ముఖ్యంగా మణిపూర్ సంక్షోభం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన అర్డినెన్స్, కామన్ సివిల్ కోడ్ అంశాలు పార్లమెంటును కుదిపేయనున్నాయని భావిస్తున్నారు.
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జూలై 20నుండి ఆగస్టు 11వరకు కొనసాగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 21కొత్త బిల్లులు, ఏడు పాత బిల్లులు ఈ దఫా సమావేశాల్లో చర్చకు రానున్నాయని తెలిపారు.