లిక్కర్‌ కేసులో డబ్బు జాడలు.. బీజేపీలో!

ఢిల్లీ లిక్కర్‌ కేసులో డబ్బుల జాడ తెలుసుకునేందుకు కేజ్రీవాల్‌ కస్డడీని కోరుతున్న రౌస్‌ అవెన్యూ

లిక్కర్‌ కేసులో డబ్బు జాడలు.. బీజేపీలో!

లిక్కర్‌ కేసులో డబ్బు జాడలు.. బీజేపీలో!

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కేసులో డబ్బుల జాడ తెలుసుకునేందుకు కేజ్రీవాల్‌ కస్డడీని కోరుతున్న రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఈడీ చెప్పిన అంశాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో నిందితుడిగా ఉన్న శరత్‌చంద్రారెడ్డి బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చారని, అంటే.. ఈడీ వెతుకుతున్న డబ్బు జాడలు బీజేపీలో ఉన్నాయని ఆప్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్టు చేయాలని శనివారం (23.3.2024) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్‌ చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌రెడ్డిని ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసింది. అయితే.. ఆయన తదుపరి అప్రూవర్‌గా మారిపోయారు.

లిక్కర్‌ పాలసీ కేసులో డబ్బు జాడలను ఆప్‌ నేతలు ఎవరి వద్దా ఈడీ గుర్తించలేక పోయినా.. ఇదే కేసులో నిందితుడిగా ఉండి, అప్రూవర్‌గా మారిన వ్యక్తి బీజేపీకి కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారని ఆప్‌ పేర్కొన్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీ స్కాంగా చెబుతున్న కేసులో గడిచిన రెండు సంవత్సరాలుగా సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ స్కాంలో డబ్బు జాడలు ఎక్కడ? ఆ డబ్బు ఎక్కడకు పోయింది? అన్న ప్రశ్న ఈ రెండేళ్లలో పదే పదే ఎదురవుతున్నది. నేరానికి సంబంధించిన డబ్బు ఆప్‌కు చెందిన ఏ ఒక్క మంత్రి, నాయకుడు లేదా కార్యకర్త నుంచి రికవరీ చేయలేదు’ అని అతిషి అన్నారు. ఇదే కేసులో గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసిన అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ పీ రెడ్డి అనే వ్యక్తి స్టేట్‌మెంట్‌ ఆధారంగా మాత్రమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆమె చెప్పారు. అయితే.. శరత్‌ రెడ్డి బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు ఇచ్చారని పేర్కొన్నారు.

‘తాను ఎప్పుడూ అరవింద్‌ కేజ్రీవాల్‌తో మాట్లాడలేదని, ఆప్‌తో సంబంధం లేదని శరత్‌చంద్రారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయన తన స్టేట్‌మెంట్‌ను మార్చుకున్నారు. అయితే, ఆ డబ్బు ఎక్కడ? ఆ డబ్బు జాడలు ఎక్కడ?’ అని అతిషి ప్రశ్నించారు. ఆ డబ్బు జాడలు బీజేపీ ఖాతాలో కనిపిస్తున్నాయని చెప్పారు. ఈడీకి దమ్ముంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఆయన (శరత్‌ చంద్రారెడ్డి) 4.5 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను బీజేపీకి ఇచ్చారు. ఆ తర్వాత మరో 55 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశారు. మరి డబ్బు జాడ ఎక్కడ ఉన్నది? బీజేపీ ఖాతాలో. ప్రధాని నరేంద్రమోదీకి, ఈడీకి నేను సవాలు విసురుతున్నా.. మీకు దమ్ముంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్టు చేయాలి’ అని అతిషి అన్నారు.

ఎవరీ శరత్‌ చంద్రారెడ్డి?

శరత్‌ చంద్రారెడ్డి.. అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు పీవీ రాంప్రసాద్‌ రెడ్డి కుమారుడు. అరబిందో ఫార్మా ప్రమోటర్స్‌లలో ఒకరుగా ఉన్నారు. ఆప్‌ నేతలకు ముడుపులు ఇచ్చిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో కూడిన సౌత్‌ గ్రూప్‌లో శరత్‌చంద్రారెడ్డి ఒకరని ఈడీ పేర్కొంటున్నది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కింద 9 రిటైల్‌ జోన్లు పొందేందుకు ఈ ముడుపులు ఇచ్చారనేది ఈడీ అభియోగం. ఇటీవల అరెస్టయి బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ గ్రూప్‌ సభ్యురాలే. ఈ కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు 2023 జూలైలో ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది.