ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది. శుక్రవారం సాయంత్రం జరిగే ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, క్రిస్టియన్ సంఘాల పెద్దలు హాజరుకానున్నారు.
క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను నాంపల్లి లేదా రవీంద్ర భారతి వైపు మళ్లించనున్నారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రిల వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు.
గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ నుంచి సుజాత స్కూల్, చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ వైపు మళ్లించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.