♦ వారం వ్యవధిలోనే తల్లీ బిడ్డ మృతి
♦ మృతదేహాన్ని తరలించేందుకు గిరిజనుల అష్టకష్టాలు
♦ డోలి పైనే మోసుకుంటూ స్వగ్రామానికి తరలింపు
విజయనగరం జిల్లా శృంగవరపుకోట గిరి శిఖర గ్రామమైన చిట్టెంపాడులో విషాదం అలుముకుంది. అనారోగ్యం బారిన పడిన మాదల గంగమ్మ విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు గిరిజనం అష్టకష్టాలు పడ్డారు. అంబులెన్స్ లు లేకపోగా.. కనీసం ఆటోవాలా కూడా కరుణించలేదు. సరైన రోడ్డు మార్గం లేని ఆగ్రామానికి ఎస్ కోట నుంచి బొడ్డవర వరకు ద్విచక్ర వాహనంపైనే మహిళ మృతదేహాన్ని తరలించారు. అక్కడి నుంచి డోలి కట్టి.. ఇద్దరే మోస్తూ కొండగుట్టల్లో మృతదేహాన్ని చిట్టెంపాడు గ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతురాలి 6 నెలల బిడ్డ వారం క్రితమే మృతిచెందింది. బిడ్డ చనిపోయిన వారం రోజులకే తల్లి మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
♦ ఎన్ని ప్రాణాలు పోతే గిరి శిఖర గ్రామానికి రోడ్డు వేస్తారు..?
విజయనగరం జిల్లా శృంగవరపుకోట గిరి శిఖర గ్రామ వాసులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా తమ తలరాతలు మారడం లేదంటూ గిరిజనులు వాపోతున్నారు. మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కొండపై బతక లేక.. మైదాన ప్రాంతంలోకి రాలేక గిరిజనులు తీవ్ర వేదనలో ఉన్నారు. అయితే సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. ప్రధానంగా రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యంతో పలుమార్లు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే తరహాలో వారం రోజుల క్రితం ఆరు నెలల బాలుడు చనిపోగా, మంగళవారం బాలుడు తల్లి గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. బాధిత కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ విషయంపై గిరిజనులు ఆవేదన చెందారు. తమ గ్రామాలకు ఎంతోమంది పాలకులు వస్తున్నారు.. వెళుతున్నారు తప్ప రోడ్డు మాత్రం వేయడం లేదని.. ఇంకా ఎంతమంది చస్తే తమ గ్రామానికి రోడ్డు వస్తుందో అని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు.