వారిద్దరూ పురుషులే.. కానీ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒకరు యువతిగా మారేందుకు సిద్ధపడ్డారు. ఇంకేముంది.. వారిలో ఒకరు కోటి రూపాయాలు ఖర్చు పెట్టి లింగ మార్పిడి చేయించుకున్నారు. కానీ చివరకు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రియుడు నిరాకరించాడు. ఆమె ఆగ్రహంతో ప్రియుడి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌కు చెందిన వైభవ్ శుక్లా, దీప్ అనే ఇద్దరు అబ్బాయిలు సోషల్ మీడియాలో పరిచయమయ్యారు. వీరిద్దరూ మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దీప్ యువతిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఇక కోటి రూపాయాలు ఖర్చు పెట్టి దీప్ లింగ మార్పిడి చేయించుకున్నాడు. దీప్ అచ్చం అమ్మాయిలా మారిపోయాడు. వైభవ్ శుక్లాను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు దీప్. కానీ అంతలోనే వైభవ్ దీప్‌ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
తన ప్రియుడు తనను కాదనడంతో దీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన స్నేహితుడితో కలిసి వైభవ్ ఇంటికి వెళ్లింది. అక్కడ పార్కింగ్ చేసిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది దీప్. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దీప్‌తో పాటు ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే కారుకు నిప్పంటించడంతో వైభవ్ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోతుందని దీప్ భావించింది. కానీ స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.
లింగ మార్పిడి కంటే ముందు.. తనను పెళ్లి చేసుకుంటానని వైభవ్ ప్రమాణం చేశాడు. ఇద్దరం కలిసి బతుకుదాం.. లేదంటే కలిసి చనిపోదాం అని ప్రమాణం చేసిన వైభవ్.. ఇప్పుడు మోసం చేశాడని దీప్ ఆవేదన వ్యక్తం చేసింది. లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత మోసం చేయడం సరికాదని వాపోయింది. వైభవ్‌ను కూడా అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని దీప్ పోలీసులను డిమాండ్ చేసింది