TS Polycet 2024 | తెలంగాణ పాలిసెట్‌ పరీక్ష వాయిదా.. ఎందుకంటే..!

TS Polycet 2024 | తెలంగాణ పాలిసెట్‌ పరీక్ష వాయిదా.. ఎందుకంటే..!

TS Polycet 2024 : తెలంగాణలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పాలిసెట్‌) వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం మే 17న పాలిసెట్‌ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాలిసెట్‌ పరీక్షను మే 17కు బదులుగా మే 24న నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కార్యదర్శి ఎ పుల్లయ్య ఒక ప్రకటన చేశారు.

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం గత నెలలో పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌) సీట్లను పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీచేస్తారు. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 24 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.