TSPSC | సర్వీస్ కమిషన్ కార్యదర్శిపై సిట్ ప్రశ్నల వర్షం.. 100పైగా మార్కులు వచ్చినా ఎందుకు అనుమానించలేదు?
ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నాడని తెలిసి అతడిని ఎందుకు సెలవులపై పంపలేదు? 100పైగా మార్కులు వచ్చినా ఎందుకు అనుమానించలేదు? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియ విధివిధానాలు ఏమిటి? విధాత: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకోమలుపు తిరుగుతున్నది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యులు లింగారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఏ.ఆర్ శ్రీనివాస్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను నేరుగా ప్రశ్నించాడు. పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్ విభాగం రెండూ కూడా […]

- ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నాడని తెలిసి అతడిని ఎందుకు సెలవులపై పంపలేదు?
- 100పైగా మార్కులు వచ్చినా ఎందుకు అనుమానించలేదు?
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియ విధివిధానాలు ఏమిటి?
విధాత: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకోమలుపు తిరుగుతున్నది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యులు లింగారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఏ.ఆర్ శ్రీనివాస్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను నేరుగా ప్రశ్నించాడు.
పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్ విభాగం రెండూ కూడా కార్యదర్శి ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. కాన్ఫిడెన్షియల్ విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్న శంకర లక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కొట్టేసిన ప్రవీణ్ ప్రశ్నపత్రాలను దొంగిలించాడు. కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా ప్రవీణ్ పనిచేస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో కార్యదర్శి పాత్ర కీలకంగా మారింది.
నిందితుడు ప్రవీణ్ గ్రూప్-1 రాస్తున్నాడని తెలిసి అతడిని సెలవులపై ఎందుకు పంపలేదని అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించారు. అతనికి 100 పైగా మార్కులు వచ్చినా ఎందుకు అనుమానించ లేదని ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ కేసులో మరో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి, గ్రూప్-1 పరీక్ష రాసిన రమేశ్ ఇద్దరూ టీఎస్‌పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియ విధివిధానాలపై రామచంద్రన్ ను సిట్ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు.
పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబుల కీలు ఎవరి అధీనంలో ఉంటాయని అడిగి ఆమె వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు, కీలు ఛైర్మన్ అధీనంలో ఉంటాయని ఆమె తెలిపినట్టు సమాచారం.
ఛైర్మన్ కంప్యూటర్‌లోనే ఉంటాయని వివరించినట్టు, దీనిలో బోర్డు అధికారుల ప్రమేయం ఉండదని సిట్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి సిట్ విచారణకు రావాల్సి ఉంటుందని అనితా రామచంద్రన్‌కు సిట్ అధికారులు చెప్పినట్టు సమాచారం.
మరోవైపు కమిషన్ సభ్యులు లింగారెడ్డి ని సిట్ అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. ఆయనకు సహాయకుడిగా పనిచేసిన రమేశ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులకుపైగా వచ్చాయని, ఆయకు ప్రశ్నపత్రం ప్రవీణ్ ద్వారా చేరిందని దర్యాప్తులో తేలింది.
రమేశ్ ఎప్పటి నుంచి పీఏగా పనిచేస్తున్నాడని లింగారెడ్డిని ప్రశ్నించారు. రమేశ్ వ్యవహారశైలి, ఆయన ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం. రమేశ్ గ్రూప్-1 పరీక్ష రాసిన విషయం తనకు తెలియదని లింగారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా లింగారెడ్డి ఎదటనే రమేశ్‌ను ఉంచారు. అతను తన పీఏనే అని లింగారెడ్డి ఒప్పకున్నట్టు సమాచారం.