కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలి
రాష్ట్ర విద్యాశాఖలో కేంద్ర ప్రాయోజిత పథకం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్

– పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి
– పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి
– ఉపముఖ్యమంత్రికి టీఎస్ యూటీఎఫ్ వినతి
విధాత: రాష్ట్ర విద్యాశాఖలో కేంద్ర ప్రాయోజిత పథకం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు (యుఆర్ఎస్), సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖ సీఆర్టీలకు కనీస వేతనాలు అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి కోరారు. ఈమేరకు సోమవారం ప్రజాభవన్ లోని క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డితో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
గత ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పును కూడా అమలు చేయలేదని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు(పీఏబీ) సమావేశంలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ వారు పని చేస్తున్న పోస్టు మినిమం టైం స్కేల్/బేసిక్ పే అమలు చేసే విధంగా ప్రతిపాదనలు సమర్పించి ఆమోదింపజేసి అమలు చేయాలని కోరారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీలకు కూడా బేసిక్ పే ఇవ్వాలని కోరారు. ట్రెజరీలో ఆమోదం పొంది ఏడాది కాలంగా ఇకుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, పాఠశాలలకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని, బీసీ గురుకులాల పనివేళలు ఇతర గురుకులాలతో సమానంగా మార్చాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని భట్టి హామీ ఇచ్చారు.