రైలు ప్రయాణికుడిపై టీటీఈ దాడి.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లో ఓ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) అత్యుత్సాహం ప్రదర్శించాడు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) అత్యుత్సాహం ప్రదర్శించాడు. రైలు ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బరౌని – లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు ప్రయాణిస్తున్నాడు. అతని వద్దకు వచ్చిన టీటీఈ కోపంతో ఊగిపోయాడు. ఆ ప్రయాణికుడి చెంప ఛెల్లుమనిపించాడు. అలా నాలుగైదు సార్లు దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అతని మెడలో ఉన్న మఫ్లర్‌ను లాగి పైకి లేవాలని ఆదేశించాడు.
ఈ దాడిని అక్కడున్న మరో ప్రయాణికుడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే తాను ఏం తప్పు చేశానని, ఎందుకు కొడుతున్నారని సదరు ప్రయాణికుడు టీటీఈని ప్రశ్నించగా, సమాధానం రాలేదు. మరో ప్రయాణికుడు కూడా ఎందుకు కొడుతున్నారని టీటీఈని ప్రశ్నించాడు. అతనిపై కూడా టీటీఈ కస్సుబుస్సులాడాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డ టీటీఈపై చర్యలు తీసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంలో లక్నో డివిజన్ డీఆర్ఎం టీటీఈని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.