Turkey-Syria Earthquake | మరుభూమిలా తుర్కియే, సిరియా.. పెను విధ్వంసంలో 7,800మందికిపైగా మృత్యువాత
Turkey-Syria Earthquake | 24గంటల వ్యవధిలో తుర్కియే-సిరియాలో భూకంపాలు పెను విధ్వంసం సృష్టించాయి. వరుస భూకంపాల ధాటికి ఇప్పటి వరకు 7,800మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండుదేశాల్లో 30వేల మందికిపైగా గాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తుర్కియేలో మరణాల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. సోమవారం తుర్కియేలో నాలుగు భూకంపాలు భూకంపాలు రికార్డయ్యాయి. మంగళవారం సైతం రిక్టర్ స్కేల్‌పై 5 కంటే ఎక్కువ తీవ్రతతో మూడుసార్లు ప్రకంపనలు వచ్చాయి. ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటి […]

Turkey-Syria Earthquake | 24గంటల వ్యవధిలో తుర్కియే-సిరియాలో భూకంపాలు పెను విధ్వంసం సృష్టించాయి. వరుస భూకంపాల ధాటికి ఇప్పటి వరకు 7,800మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండుదేశాల్లో 30వేల మందికిపైగా గాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తుర్కియేలో మరణాల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. సోమవారం తుర్కియేలో నాలుగు భూకంపాలు భూకంపాలు రికార్డయ్యాయి. మంగళవారం సైతం రిక్టర్ స్కేల్‌పై 5 కంటే ఎక్కువ తీవ్రతతో మూడుసార్లు ప్రకంపనలు వచ్చాయి. ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటి వరకు 5,400 మందికిపైగా మృతిచెందారని తుర్కియే అధ్యక్షుడు ఎర్డగోన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో భూకంప ప్రభావిత పది రాష్ట్రాల్లో మూడు నెలల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. రిక్టర్ స్కేల్‌పై 7 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన పెను భూకంపాల ధాటికి దాదాపు 6వేలకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. సిరియాలో ఇప్పటి వరకు 1800 మృతదేహాలను వెలికి తీసినట్లు రెడ్ క్రెసెంట్ సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2.3కోట్ల మంది ప్రభావితం కాగా.. 1.5లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూకంపంతో తుర్కియే 150 కిలోమీటర్ల వ్యాసార్థంలో మూడు మీటర్లు ఈశాన్య, నైరుతి దిశగా మళ్లిందని ఇటలీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిక్స్ అండ్ వాల్కనాలజీ ప్రెసిడెంట్ కార్లో డోగ్లియోని తెలిపారు.
రక్షించండి.. జీవితాతం బానిసత్వం చేస్తా
భూకంపం కారణంగా పెద్ద ఎత్తున భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు తుర్కియే, సిరియాలో కనిపిస్తున్నాయి. ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇప్పటికీ ఎంతో మంది చిక్కుకుపోయారు. శిథిలాలను తొలగించిన కొద్ది ప్రాణాలతో కొందరు బయటపడుతుండగా.. మృతదేహాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అయితే, సిరియాలో పదేళ్ల బాలికతో పాటు ఆమె మూడేళ్ల సోదరిని విపత్తు సంభవించిన 17 గంటల తర్వాత శిథిలాల నుంచి రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల వద్దకు చేరుకోగానే బాలిక తనను రక్షించాలని.. తన జీవితాంతం బానిసత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రాబోయే 48 గంటలు కీలకం..
తుర్కియే, సిరియాలో రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవి ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ ప్రాంతీయ అత్యవసర అధికారి కేథరీన్ స్మాల్‌వుడ్ పేర్కొన్నారు. మళ్లీ ప్రకంపనలు వస్తే సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఇంకా నష్టం జరిగే అవకాశాలున్నాయన్నారు. తుర్కియేలో 24గంటల వ్యవధిలో ఐదు భూకంపాలు సంభవించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం సైతం రెండుసార్లు భూమి కంపించింది. ఇప్పటి వరకు తుర్కియేలో 5వేలకుపైగా జనం మృత్యువాతపడగా.. సిరియాలో 1444 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. భారీ భూకంపం తర్వాత తుర్కియే, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు వంద భూ ప్రకంపనలు సంభవించాయని భూగర్భశాస్త్రవేత్తలు తెలిపారు.