విధాత, హైదరాబాద్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకడంపై కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్య ట్వీట్ల వార్, మాటల మంటలు రేగుతున్నాయి. బీఆరెస్ తన ట్వీట్‌లో మొన్నటి దాకా తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్‌గా ఉండేనని, ఇప్పుడీ తెలంగాణ ద్రోహి గద్దెనెక్కినంక గుజరాత్ మోడల్ అనుకరిస్తాడట! ఎవరు ఎవరికి “బి” టీమ్ అనేది స్పష్టంగానే అర్థమవుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీఆరెస్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్ తన ట్వీట్‌లో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన ప్రథమ లక్షణం… రాజ్యాంగాన్ని… రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని గౌరవించడమని స్పష్టం చేసింది. తన రాజకీయ లాభాపేక్షకు రాజ్యంగ విలువలకి తూట్లు పొడిచి.. అన్ని నేనే… అంత నాకే తెలుసు… నన్ను మించిన వాడు లేడన్న గత ముఖ్యమంత్రి తీరు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని కౌంటర్ వేసింది. పాలకులుగా గౌరవించుకోవాలి… పార్టీగా పొట్లాడుకోవాలని హితవు పలికింది.