తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్‌

మిచౌంగ్ తుఫాన్ బాపట్ల దగ్గర తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండగా, సముద్రం అల్లకల్లంగా మారింది

  • By: Somu    latest    Dec 05, 2023 11:23 AM IST
తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్‌
  • ఏపీలో తుఫాన్ బీభత్సం.. తెలంగాణలోనూ అలర్ట్‌


విధాత : మిచౌంగ్ తుఫాన్ బాపట్ల దగ్గర తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండగా, సముద్రం అల్లకల్లంగా మారింది. బాపట్ల తీర ప్రాంతం సముద్రంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏపీలో కృష్ణ, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు గుంటూరు, తిరుపతి సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ధాటికి పెద్ద సంఖ్యలో వృక్షాలు, కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. పంటలు భారీగా దెబ్బతిన్నాయి.


ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు తూఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంది. విశాఖ ఎయిర్ పోర్టు తుఫాన్ ప్రభావంతో మూతపడింది. విశాఖ నుంచి బయలుదేరాల్సిన 26 విమాన సర్వీసులను మంగళవారం రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ్ 305రైళ్లను ఈ నెల 8వ తేదీ వరకు రద్దు చేసి మరో 11రైళ్లను దారి మళ్లించి, 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లుగా తెలిపింది. ఏపీలో అల్లవరం మండలం ఓడలరేవు సముద్రతీరంలో పెరిగిన అలల ఉధృతికి సముద్రం కోతకు గురవుతు సముద్రం ముందుకు చొచ్చుకొస్తుంది.


ఇటు తెలంగాణలోనూ మంగళవారం రాత్రి, బుధవారం ఉరుములు మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ వారం నుంచే భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో వాగులు వంకలు పొంగుపొర్లుతున్నాయి. హైద్రాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.


బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి, భూపాలపల్లి, నాగర్ కర్నూల్‌ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీచేశారు.