ఇంట్లో భారీ పేలుడు.. ఇద్దరు బాలురు దుర్మరణం
ఇంట్లో పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులైన అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నుంచి బాలుర తల్లితోపాటు ఇద్దరు తాతలు ప్రాణాలతో బయటపడ్డారు.

- తృటిలో తప్పించుకున్నతల్లి, తాతలు
- అమెరికాలోని మిస్సోరీలో ఘటన
విధాత: ఇంట్లో పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులైన అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నుంచి బాలుర తల్లితోపాటు ఇద్దరు తాతలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. శీతల పరిస్థితుల కారణంగా మిస్సోరీ రాష్ట్రంలోని డిఫైయన్స్ నగరంలో మంచు దట్టంగా కురుస్తున్నది. దాంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో నాలుగేండ్ల జూలియన్ కీజర్, ఇతడి అన్న ఆరేండ్ల జామిసన్ శుక్రవారం నాడు ఇంట్లోనే ఉన్నారు. ముద్దులొలికే ఈ ఇద్దరు బాలురను పొరుగింటి వారు స్వీటెస్ట్ లిటిల్ బాయ్స్‌గా పిలిచేవారు. అయితే, ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, ఒక్కసారిగా ఇంట్లో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాలుర తల్లి ఎవెలిన్ టర్పియానో, తాతలు, జెన్నిఫర్ హామ్, వెర్న్ హామ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, బాలురు ఇద్దరు ఇంట్లోనే చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది బాలుర ఆచూకీ కోసం వెతుకుతూ కిటికీ ఇంటిలోకి ప్రవేశించారు. సమయానికి వారి వద్దకు చేరుకోలేకపోవడంతో ఇద్దరూ బాలురు చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు జరురుపుతున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.