ఉమామహేశ్వర ఎత్తిపోతలకు.. శివ శివా.. నువ్వే దిక్కు!

ఎన్నికల స్టంట్ కోసం కేసీఆర్ వేసిన ఎత్తుగడలన్నీ బోల్తా కొట్టాయి. ఎత్తిపోతల పథకాల పేరుతో ఓట్లు రాబట్టుకోవాలని చూసిన కేసీఆర్ మంత్రాంగం బెడిసికొట్టింది

  • By: Somu    latest    Jan 09, 2024 10:24 AM IST
ఉమామహేశ్వర ఎత్తిపోతలకు.. శివ శివా.. నువ్వే దిక్కు!
  • ‘ఎత్తిపోతల’కు గ్రహణం
  • ముందుకుసాగని ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం
  • ఆగమేఘాల మీద అనుమతులిచ్చిన అప్పటి కేసీఆర్ సర్కార్
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి ఉమా మహేశ్వర లిఫ్ట్ కు నీరు
  • పాలమూరు ప్రాజెక్టు పనులకే దిక్కులేదు.. లిఫ్ట్ ముందుకు సాగేదెట్టా?
  • లిఫ్ట్ వద్దంటూ అచ్చంపేట రైతుల ఆందోళన

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల స్టంట్ కోసం కేసీఆర్ వేసిన ఎత్తుగడలన్నీ బోల్తా కొట్టాయి. ఎత్తిపోతల పథకాల పేరుతో ఓట్లు రాబట్టుకోవాలని చూసిన కేసీఆర్ మంత్రాంగం బెడిసికొట్టింది. సాగునీటి పేరుతో జిల్లా రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు.


ఆ వెంటనే పరిపాలనా అనుమతులూ ఇచ్చారు. నిధులు కూడా కేటాయించి, లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేయకుండా చేతులు దులుపుకున్నారు. ఇక్కడి రైతాంగం కేసీఆర్ మాటలు నమ్మి.. నీళ్లు వచ్చినట్లు సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ఎత్తిపోతల పథకంలో గంపెడు మట్టి కూడా తీయలేదు. ప్రస్తుతం ఈ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని ఇక్కడి రైతులు ఆందోళనబాట పడుతున్నారు.


సూరారంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం


నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం చేసేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ఉమామహేశ్వర పేరుతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వరుని పేరును ఈ రిజర్వాయర్‌కు పెట్టారు. ఈ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం రూ.1,534 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతులను రాత్రికి రాత్రే జారీ చేసింది. నల్లమల ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టెందుకు కొంత కష్టతరంగా మారింది. మళ్ళీ ఈ పథకానికి రూపకల్పన చేశారు.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా వనపర్తి జిల్లా ఏదుల గ్రామం వద్ద నిర్మించిన జలాశయం నుంచి సుమారు 25 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా లింగాల మండలం సూరారంలో నిర్మించనున్న 2.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఉమామహేశ్వర జలాశయానికి నీటిని తరలిస్తారు. ఈ నీటిని బల్మూర్‌, కొండనాగుల, మైలారం గ్రామాల పరిధిలో నిర్మించే లిఫ్టుతో ఆయకట్టుకు నీటిని ఎత్తిపోస్తారు. దీంతో అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్‌ మండలాల్లోని 57,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పథకానికి రూపకల్పన చేశారు.


ఈ ఎత్తిపోతల పథకం కాకుండా ఇప్పటివరకు మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (ఎంజీకేఎల్‌ఐ) పరిధిలో అచ్చంపేటలో కేవలం 3 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది. ఇక స్టేజ్‌-2 పనుల్లో భాగంగా మున్ననూర్‌ వద్ద నిర్మించనున్న ప్రతిపాదిత చెన్నకేశవ రిజర్వాయర్‌తో అమ్రాబాద్‌, పదరకు సాగునీరు అందనున్నది. ఈ పనులకూ త్వరలోనే పరిపాలనా అనుమతులు రానున్నాయి. ఈ రిజర్వాయర్‌ పూర్తయితే మరో 20 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. రెండు లిఫ్టులు పూర్తయితే నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందుతుంది. సర్కార్ నివేదిక ప్రకారం బాగానే ఉన్నా, ప్రస్తుతం పథకం పనులు మాత్రం కాగితాలకే పరిమితమైంది.


నాలుగేళ్లలో పూర్తి చేస్తామని..


పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులే ఎక్కడివక్కడ పడకేసాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయాలకు నేటికీ చుక్క నీరు చేరలేదు. నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్.. తొమ్మిది ఏళ్ళు అయినా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతేనే పలు ఎత్తిపోతల పథకాలకు మోక్షం లభిస్తుంది. కేసీఆర్ హయాంలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు నేటికీ అసంపూర్తి గానే ఉంది.


ఈ ప్రాజెక్టుపైనే నారాయణ పేట-కొడంగల్, ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. కానీ ఈ పనులు ఇప్పట్లో అయ్యే దరిదాపులో లేవు. ఇదంతా కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు బలైన ఎత్తిపోతల పథకాలుగా చరిత్ర లో నిలిచిపోతాయి.


ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలనే డిమాండ్


ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఈ పథకానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. ఇదివరకే అచ్చంపేటలో ధర్నా, నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఉమామహేశ్వర ఆలయం ఎదుట ఆందోళన చేపట్టి అందరి దృష్టిని రైతులు ఆకర్షించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ను కలిసి ఈ పథకం అనుమతులు రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ పథకం పనులు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.