పెనంతో కుళ్ల‌బొడిచి, చాకుతో 30 సార్లు మెడ‌పై న‌రికి.. త‌ల్లిని హ‌త్య చేసిన కుమార్తె

  • By: krs    latest    Sep 26, 2023 9:01 AM IST
పెనంతో కుళ్ల‌బొడిచి, చాకుతో 30 సార్లు మెడ‌పై న‌రికి.. త‌ల్లిని హ‌త్య చేసిన కుమార్తె

కాలేజీ నుంచి సస్పెండ్ అయిన‌ట్లు త‌న త‌ల్లికి తెలియ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో ఆమెను హ‌త్య చేసిన కుమార్తె ఉదంతం ఇది. చంపడం కూడా సాధార‌ణంగా కాకుండా ఇనుప పెనంతో ప‌లుమార్లు బాది, కిచెన్ చాకుతో 30 సార్లు మెడ‌పై క‌సాక‌సా పొడిచి హ‌త్య చేసింది. అమెరికా (America) లో 2020లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అక్క‌డి కోర్టు కుమార్తెను దోషిగా నిర్ధ‌రించి శిక్ష వేసింది.

ఆసుప‌త్రిలో చిన్న‌పిల్ల‌ల వార్డులో హెల్త్ కేర్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేసే బ్రెండా పావెల్ (50)ను తీవ్ర గాయాల‌పాలైన స్థితిలో మార్చి 2020లో పోలీసులు గుర్తించారు. ఆమెను హుటాహుటిన ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా చికిత్స పొందుతూ కాసేప‌టికే మృతి చెందారు. పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌గా మృతురాలి కుమార్తె సిడ్నీ పావెల్‌నే ఈ హ‌త్య చేసింద‌ని గుర్తించారు. కాలేజీ నుంచి స‌స్పెండ్ అయిన సిడ్నీకి ఈ విష‌యం త‌ల్లికి తెలిస్తే ఏమంటుందోన‌ని ఆందోళ‌న క‌లిగింది.

దీంతో ఆమెను చంపేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ముందుగా వంట గ‌దిలోంచి ఇనుప పెనం, క‌త్తి తీసుకుని వ‌చ్చి త‌ల్లిపై దాడి చేసింది. ఆ రెండింటినీ మార్చి మార్చి వినియోగిస్తూ పాశ‌వికంగా దాడి చేసింది. అయితే నిందితురాలు సిడ్నీ.. స్కిజోఫ్రీనియా అనే మాన‌సిక స‌మస్య‌తో బాధ‌ప‌డుతోంద‌ని.. హ‌త్య‌కు త‌న‌ని కార‌కురాలిగా భావించొద్ద‌ని కోర్టులో డిఫెన్స్ లాయ‌ర్లు వాదించారు. మాన‌సికంగా అనారోగ్యం క‌లిగినందువ‌ల్లే అంత‌వ‌ర‌కూ స్నేహితురాలిగా భావించిన తల్లిని చంపింద‌ని పేర్కొన్నారు.

అయితే ఈ వాద‌న‌ను ప్రాసిక్యూష‌న్ ఖండించింది. ఘ‌ట‌న జ‌రిగే స‌మ‌యానికి నిందితురాలికి అంత తీవ్ర‌మైన‌ మాన‌సిక స‌మ‌స్య‌లూ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉంద‌ని తెలిపింది. వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి.. నిందితురాలు ఆయుధాలను మార్చి మార్చి పాశ‌వికంగా హ‌త్య చేసిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోందని,, ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా, పూర్తి స్పృహ‌లో ఉండి చేసిన‌ట్లుగానే భావిస్తూ దోషిగా నిర్ధ‌రిస్తున్న‌ట్లు తీర్పు వెలువ‌రించారు. ఈ నెల 28న ఆమెకు శిక్ష ఖ‌రారు చేయ‌నున్నారు.