ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌కు కరకట్ట గుర్తొచ్చిందా?: వెరవెల్లి రఘునాథ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఎన్నికలు రాగానే గోదావరి నది కరకట్ట గుర్తొస్తుందని, మూడేళ్లుగా కరకట్ట నిర్మాణం ఎందుకు చేపట్టలేదని మంచిర్యాల బీజేపీ అభ్యర్థి వెరవెల్లి రఘునాథ్ ప్రశ్నించారు.

  • By: Somu    latest    Nov 26, 2023 11:48 AM IST
ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌కు కరకట్ట గుర్తొచ్చిందా?: వెరవెల్లి రఘునాథ్
  • మూడేళ్లుగా కరకట్ట ఎందుకు నిర్మించలేదు?
  • ముంపులో ఉంటే చూసేందుకు రాని సీఎం కేసీఆర్
  • కాళేశ్వరం ప్రాజెక్టుతో నిర్వాసితులైన మంచిర్యాల రైతులు
  • మంచిర్యాల బీజేపీ అభ్యర్థి వెరవెల్లి రఘునాథ్



విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఎన్నికలు రాగానే గోదావరి నది కరకట్ట గుర్తొస్తుందని, మూడేళ్లుగా కరకట్ట నిర్మాణం ఎందుకు చేపట్టలేదని మంచిర్యాల బీజేపీ అభ్యర్థి వెరవెల్లి రఘునాథ్ ప్రశ్నించారు. మంచిర్యాల పట్టణం ముంపునకు గురైనప్పుడు సీఎం కేసీఆర్ వచ్చి పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. మూడేళ్ల నుండి పట్టించుకోని కరకట్ట నిర్మాణం ఎన్నికల వేళ గుర్తొచ్చిందా అని నిలదీశారు. ఆదివారం మంచిర్యాల జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.


మంచిర్యాలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏజ్ బార్ అయ్యారని, వారు రాజకీయాల నుంచి రిటైర్ కావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అత్యధిక కాలం అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావు కబ్జాలకు పాల్పడతారని, గెలిపిస్తే మంచిర్యాల కబ్జా అవుతుంది అని పేర్కొన్నారు. రఘునాథ్ స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నాడని, మరి మీరు స్థానికులైతే 2014లో మంచిర్యాల నుండి ఎందుకు పోటీ చేయలేదు? సిర్పూర్ నియోజకవర్గానికి ఎందుకు వెళ్లావ్? అని ప్రశ్నించారు.


మంచిర్యాలలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆపార్టీకి క్యాడర్ కూడా లేదని పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే భూములను కబ్జా చేస్తాడని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పేర్కొన్నారు. తనను రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంచిర్యాల పట్టణంలో సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు. శ్రీనివాస టాకీస్ నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్ షో ఉంటుందని, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.