విశాఖ ఉక్కు | ఓ ఉద్యమ స్ఫూర్తి.. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితం!

సమైక్యాంధ్రుల పోరాట దీప్తి.. ఆంధ్రుల పౌరుషం ముందు తలవంచిన కేంద్రం ఎక్కడైనా ఓ సంస్థను మూసేస్తున్నా.. అక్కడి నుంచి తరలిస్తున్నా ప్రజలు ఉద్యమం చేస్తారు.. ఆ పరిశ్రమ అక్కడే ఉంచాలంటూ డిమాండ్ చేస్తారు.. లేదా హానికారక సంస్థలను అక్కడి నుంచి తరలించాలని లేదా మూసేయాలని ఆందోళన చేస్తారు. కానీ విశాఖ ఉక్కు మాత్రం..ఆంధ్రుల హక్కుగా ఓ పోరాటం అనే యజ్ఞం నుంచి దక్కిన అద్భుత ఫలం అని చెప్పవచ్చు. ఇప్పుడంటే అది ఓ విశాఖకు, ఉత్తరాంధ్రకు పరిమితం […]

  • By: krs    latest    Apr 15, 2023 4:27 AM IST
విశాఖ ఉక్కు | ఓ ఉద్యమ స్ఫూర్తి.. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితం!
  • సమైక్యాంధ్రుల పోరాట దీప్తి..
  • ఆంధ్రుల పౌరుషం ముందు తలవంచిన కేంద్రం

ఎక్కడైనా ఓ సంస్థను మూసేస్తున్నా.. అక్కడి నుంచి తరలిస్తున్నా ప్రజలు ఉద్యమం చేస్తారు.. ఆ పరిశ్రమ అక్కడే ఉంచాలంటూ డిమాండ్ చేస్తారు.. లేదా హానికారక సంస్థలను అక్కడి నుంచి తరలించాలని లేదా మూసేయాలని ఆందోళన చేస్తారు. కానీ విశాఖ ఉక్కు మాత్రం..ఆంధ్రుల హక్కుగా ఓ పోరాటం అనే యజ్ఞం నుంచి దక్కిన అద్భుత ఫలం అని చెప్పవచ్చు. ఇప్పుడంటే అది ఓ విశాఖకు, ఉత్తరాంధ్రకు పరిమితం అయిందేమో కానీ యాభయ్యేళ్ళ క్రిందట ఆంధ్రతో బాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల వంటి ప్రాంతాల్లోనూ వేలకొద్దీ జనం పాల్గొని ఉద్యమాలు చేశారు.. విశాఖలోనే స్టీల్ ప్లాంట్ పెట్టాలంటూ ధర్నాలు చేసారు.. జనజీవనాన్ని స్తంభింపజేశారు. అసలు అప్పుడు ఏమైంది ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూద్దాం.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన తరువాత.. మద్రాసు నగరాన్ని కోల్పోయామన్నఅసంతృప్తి ప్రజల్లో ఏర్పడింది. దానికి తోడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అన్యాయమే జరిగిందని ఆంధ్ర ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు నాలుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఒడిశాలో రూర్కెలా, మధ్యప్రదేశ్లో భిలాయ్, పశ్చిమబెంగాల్ లో అసన్ సోల్ ఇలా మూడు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా నిర్మించాలనుకున్న స్టీల్ ప్లాంట్లలో ఒకటి.. అంటే నాలుగోది బొకారో లో నెలకొల్పాలని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నది అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆలోచన.

కాసు బ్రహ్మానంద రెడ్డి ఉక్కు సంకల్పం

1964 శీతాకాల సమావేశాల్లో ఆ ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పరిశ్రమల విషయంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పాలి అని ఏపీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నిఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు సీపీఐకు చెందిన పి.వెంకటేశ్వర్లు, సీపీఎం కు చెందిన టి.నాగిరెడ్డి, స్వరాజ్య నేత జి.లచ్చన్న, నేషనల్ డెమొక్రాట్స్ నేత తెన్నేటి విశ్వనాథం, ఇండిపెండెంట్ నేత వావిలాల గోపాల కృష్ణయ్య ఇతర నేతలు మద్దతు ఇచ్చారు.

అప్పటికే ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం చేసిన హిందుస్తాన్ స్టీల్ మాత్రం విశాఖపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం పేరుతో ఆయన ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించారు. ఇది విశాఖపట్నం, బైలదిలా, గోవా, హోస్పేట్, సేలం, నైవేలీలను పరిశీలించిన తరువాత 1965 జూన్ 25వన నివేదికను ఇచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్ర తీరంలో అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. ఓడరేవు ఉన్న విశాఖపట్నం అన్ని విధాలా అనువైనదని నివేదికలో పేర్కొంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉక్కు కర్మాగారం బలమైన సెంటిమెంట్ గా మారింది. తెన్నేటి విశ్వనాథం సారథ్యంలో.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం బలమైన అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఏర్పడింది. అప్పటికే నివేదిక ఆధారంగా విశాఖలో ఉక్క కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్రానికి బలంగా తమ వాదన వినిపించారు. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ ఆయన 1966 జనవరిలో ఆకస్మికంగా చనిపోయారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. దీంతో ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు మళ్లీ బ్రేకులు పడ్డాయి.

విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1965న అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని స్వయంగా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయిందనే ఆగ్రహంతో ఉన్న ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలి అంటే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తప్పని సరి అని అప్పటి కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పట్లో ఐదో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని అప్పటి ప్రధాని ఇందిరాగాంధి స్పష్టం చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా స్టీల్ ప్లాంట్ కోసం పట్టుపట్టాయి.. అలాంటి సమయంలో ఏపీకి స్టీల్ ప్లాంట్ ఇస్తే మిగితా రాష్ట్రాల్లో ఆందోళనలు పెరుగుతాయని ఇందిర భయపడి ఉంటారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆలస్యానికి కారణమైంది. ఒకవర్గంపై మరో వర్గం పైచేయి సాధించడానికి ఉక్కు సెంటిమెంట్ ను ఎత్తుకున్నాయని అప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా జరిగింది. ఈ రాజకీయాల మధ్య స్టీల్ ప్లాంట్ నిర్మాణం సాధ్యం కాదని బలమైన అభిప్రాయం రావడంతో 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం బలపడింది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాలు ఉద్యమంలో చేరాయి. వారికి విపక్ష రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎగసిపడ్డాయి. బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు పెరిగాయి. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె.బాబూరావు సహా తొమ్మిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థులు కూడా ఉన్నారు.

దీంతో ఉద్యమం ఉద్ధృతమైంది. ఉద్యమం హింసాత్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమయ్యాయి. రైల్వేకి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏలూరు కాలువలో పడేశారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో.. తగరపువలసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్‌లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మొత్తం మీద విశాఖతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఈ ఉద్యమం కోసం ఒకే రోజు ప్రాణాలు అర్పించారు.

ఉద్యమం హింసాత్మకంగా మారడం.. ఒకే రోజు అంతమంది ప్రాణాలు అర్పించడంతో ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీలనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 1966 నవంబర్ 3న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సరేనందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది. అయితే.. ఉద్యమాన్ని అణచి వేయడానికే మంత్రివర్గ ఉపసంఘాన్ని తెరపైకి తెచ్చిందని వివిధ రాజకీయ పక్షాలు విమర్శించాయి. అందరూ ఊహించినట్టే కేంద్రం మాత్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.. ఆ ప్రతిపాదను పక్కన పడేసింది.

మరోవైపు పోలీసుల కాల్పులపై న్యాయవిచారణ జరిపించాలన్న డిమాండ్‌‌ను ప్రభుత్వం తిరస్కరించ టానికి నిరసనగా.. 1966 నవంబర్ 17న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాలు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 67 మంది ఎంఎల్‌ఏలు.. తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. సీపీఐకి చెందిన నలుగురు లోక్‌సభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. కానీ.. ఆ తర్వాత 1967 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 165 అసెంబ్లీ సీట్లు, 35 లోక్‌సభ సీట్లు గెలుకుని కేంద్ర, రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల బలం 51 నుంచి 20కి తగ్గిపోయింది. స్వతంత్ర పార్టీ 29 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే ఆ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత.. 1970 ఏప్రిల్ 17న.. విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంటు కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు.

డీపీఆర్ తయారీ బాధ్యతను మెస్సర్స్ ఎం.ఎన్.దస్తూర్‌ అండ్ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో 1,000 కోట్లు మంజూరు చేయటంతో పనులు మొదలయ్యాయి. ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది.

అలా ప్రారంభమైన ఉక్క పరిశ్రమ ఇప్పుడు 26 వేల ఎకరాల్లో విస్తరించింది. ప్రతి ఏడాది 7.3 మిలియన్‌ టన్నులు ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. సుమారు 16 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 17 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా.. లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విశాఖ కు జాతీయ స్థాయి గుర్తింపు, పారిశ్రామిక హోదా రావడానికి విశాఖ ఉక్కు ఎంతగానో దోహదపడింది. విశాఖ ఉక్కును ఆనుకుని ఎన్నో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.

వందలాది వ్యాపార సంస్థలు వచ్చి. గాజువాక, లంకెలపాలెం ద్వారపూడి, పరవాడ, అచ్యుతాపురం వంటి సాధారణ గ్రామాలు ఇప్పుడు విశాఖ నగరంలో భాగమవడం వెనుక విశాఖ ఉక్కు పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు అలంటి సంస్థను ప్రయివేటీకరణ లేదా అమ్మేయడం అనేది ప్రజలకు మింగుడుపడని అంశంగా మారింది. అందుకే దాన్ని కాపాడుకునేందుకు పార్టీలకు అతీరంగా ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖ ఉక్కు అంశం కీలకంగా మారుతుంది..