Viveka Murder Case | వివేకా హత్యకేసులో మరో మలుపు.. A-8గా అవినాష్
Viveka Murder Case విధాత: జూన్ 30లోగా వివేకా హత్యకేసు తెల్చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జోరు పెంచింది. ఇప్పటికే ఆ కేసులో సహనిందితునిగా పేర్కొంటూ ఎంపి అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచిన సీబీఐ ఇప్పుడు ఏకంగా ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చింది. ఈమేరకు ఆయన్ను ఏ - 8 గా పేర్కొంది. మరోవైపు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద ఇప్పటికే వాదనలు పూర్తి కాగా శుక్రవారం […]

Viveka Murder Case
విధాత: జూన్ 30లోగా వివేకా హత్యకేసు తెల్చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జోరు పెంచింది. ఇప్పటికే ఆ కేసులో సహనిందితునిగా పేర్కొంటూ ఎంపి అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచిన సీబీఐ ఇప్పుడు ఏకంగా ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చింది. ఈమేరకు ఆయన్ను ఏ – 8 గా పేర్కొంది.
మరోవైపు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద ఇప్పటికే వాదనలు పూర్తి కాగా శుక్రవారం దీనిమీద తీర్పు రానుంది. అయితే భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగానే వాదిస్తోంది.
ఆయనకు బెయిల్ ఇవ్వవద్దంటూ మొన్న ఐదో తేదీన కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ ఆ సందర్భంగా పలు పాయింట్లు లేవనెత్తింది.
మర్డర్ ఘటనకు సంబంధించి సాక్ష్యాల చెరిపివేతలో తండ్రి కొడుకులు అవినాష్, భాస్కర్ రెడ్డిల ప్రమేయం ఉందని సీబీఐ అంటోంది. అంతేకాకుండా .. దర్యాప్తును పక్కదారి పట్టించేలా వారు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారని సీబీఐ అంటోంది.
కడప పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్ రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని సీబీఐ పేర్కొంది.
అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో ధర్నాలు, ర్యాలీలు జరిగాయని, దీన్ని బట్టి చూస్తేగానీ ఎంతటి బలవంతుడు అన్నది తెలుస్తోందని సీబీఐ అంటోంది.
ఇక హత్య స్థలానికి వచ్చిన అవినాష్ అక్కడి రక్తపు మరకలను శుభ్రం చేయించారని, ఇది ఆధారాలను ధ్వంసం చేయడమేనని సీబీఐ చెబుతూ ఆయన్ను ఏకంగా నిందితుడిగా పేర్కొంది. ఇది ఇపుడు అవినాష్ కు ఇబ్బంది కలిగించే అంశం.. ఆంధ్రలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ఇప్పుడు ఆయన్ను ఇలా నిందితుడిగా చేర్చడం ఆయన్ను మరింత చికాకు పరుస్తోంది.