మార్పుకే ఓటు.. ఎమ్మెల్యేల‌కు కాదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార మార్పున‌కు అవ‌స‌ర‌మైన మెజార్టీని ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి క‌ట్ట‌బెట్టారు. ప‌దేండ్ల కేసీఆర్ పాల‌న‌ను మార్చాల‌ని ప్ర‌జ‌లు ఓట్లు వేశారు

మార్పుకే ఓటు.. ఎమ్మెల్యేల‌కు కాదు
  • నకిరేక‌ల్‌లో వేములకు 68,839 ఓట్ల ఆధిక్యం
  • 2014లో ఇదే వీరేశంకు మెజార్టీ 2,370 ఓట్లే
  • ప్ర‌భుత్వం మార్పు కోస‌మే ఓటేసిన ప్ర‌జ‌లు


విధాత‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార మార్పున‌కు అవ‌స‌ర‌మైన మెజార్టీని ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి క‌ట్ట‌బెట్టారు. ప‌దేండ్ల కేసీఆర్ పాల‌న‌ను మార్చాల‌ని ప్ర‌జ‌లు ఓట్లు వేశారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు భారీ మెజార్టీని అందించారు. ఆ మెజార్టీని చూసి స‌దరు ఎమ్మెల్యేలే అవాక్క‌య్యారు. న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి వేముల వీరేశం 68,839 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందడం ఈ ట్రెండ్స్‌కు ఉదాహ‌ర‌ణగా రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.


చిరుమ‌ర్తి, వేముల మ‌ధ్య పోరు హోరాహోరాగా సాగింది. ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచినా 5-10 వేల ఓట్ల మెజార్టీయే వ‌స్తుంద‌ని ఆయా పార్టీల నాయ‌కులు భావించారు. కానీ, అనూహ్యంగా వేముల‌కు 68,839 ఓట్ల మెజార్టీ రావ‌డంపైఆ పార్టీ నాయ‌కులే ఆశ్చ‌ర్య పోతున్నారు. అంత మెజార్టీ వ‌స్తుంద‌ని తాము కూడా ఊహించ‌లేద‌ని చెప్తున్నారు. ఇదంతా కేసీఆర్ పాల‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌తోనే ప్ర‌జ‌లు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గంప‌గుత్త‌గా ఓట్లు గుద్దార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.


ప్రత్యేక‌ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వేముల వీరేశం ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ నుంచి చిరుమ‌ర్తి లింగ‌య్య పోటీచేశారు. నాడు వేముల వీరేశం కేవ‌లం 2,370 ఓట్ల స్వల్ప మెజార్టీతో చిరుమ‌ర్తిపై గొలుపొందారు.


2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి వేముల వీరేశం పై కాంగ్రెస్ అభ్య‌ర్థి చిరుమ‌ర్తి లింగ‌య్య 8,259 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంత‌రం లింగ‌య్య కాంగ్రెస్ నుంచి కారు పార్టీలోకి మారారు. బీఆర్ఎస్‌లో ఉన్న వీరేశం ఎన్నిక‌ల‌కు కొన్ని రోజులు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిరుమ‌ర్తి, వీరేశం ఇద్ద‌రు తాజా ఎన్నిక‌ల్లో హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. వీరేశం దూకుడు స్వ‌భావం క‌లిగిన వ్య‌క్తి అయితే, చిరుమ‌ర్తిని కొంత సౌమ్యుడిగా పేరున్న‌ది. స్వ‌రాష్ట్రంలో గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లో ఈ స్థానంలో 5-10 వేల ఓట్ల మెజార్టీ మించి ఎవ‌రికీ దాట‌లేదు.


ఈ సారి కూడా అదే విధంగా ఫ‌లితాలు ఉంటాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, బీఆర్ ఎస్ అభ్య‌ర్థి చిరుమర్తి లింగయ్యకు 64,701 ఓట్లు వ‌స్తే, వేముల వీరేశంకు ఏకంగా 1,33,540 ఓట్లు ప‌డ్డాయి. లింగయ్యపై 68,839 ఓట్ల భారీ ఆధిక్యంతో వీరేశం గెలిచారు. సుమారు 70 వేల మెజార్టీ రావ‌డం ప‌ట్ల అభ్య‌ర్థి వీరేశం ప‌ట్ల ప్ర‌జ‌ల ప్రేమ కాద‌ని, ప్ర‌భుత్వ మార్పు కోరుతూ ప్ర‌జ‌ల్లో ఉన్న బ‌ల‌మైన కోరికే ఈ మెజార్టీకి నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొన్ని ఊర్లు మొత్తం హ‌స్తం బాటే ప‌ట్టాయి. మూకుమ్మ‌డిగా చేతి గుర్తుకే ఓటేశారు. రాష్ట్రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఇదే త‌ర‌హాలో స్థానిక ఎమ్మెల్యే అభ్య‌ర్థిని చూడ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వ మార్పే ల‌క్ష్యంగా ప్ర‌జ‌లు ఓట్లు వేసిన‌ట్టు ప‌రిశీలకులు భావిస్తున్నారు.