Huzarabad: వర్గ పోరుకు తెరపడేనా? MLC కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ మధ్య ప్రచ్చన్న యుద్ధం
వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరి ప్రయత్నాలు కమలాపూర్ సభలో కౌశిక్ రెడ్డికి అనుకూలంగా కేటీఆర్ సంకేతాలు అయినా వెనక్కి తగ్గని గెల్లు, వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని బహిరంగ ప్రకటనలు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టిన కేసీఆర్ విధాత బ్యూరో, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో.. వర్గ పోరుకు తెరపడినట్టేనా? ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్య సయోధ్య కుదిరినట్టేనా? ప్రస్తుతం రెండు వర్గాల […]

- వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరి ప్రయత్నాలు
- కమలాపూర్ సభలో కౌశిక్ రెడ్డికి అనుకూలంగా కేటీఆర్ సంకేతాలు
- అయినా వెనక్కి తగ్గని గెల్లు, వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని బహిరంగ ప్రకటనలు
- టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టిన కేసీఆర్
విధాత బ్యూరో, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో.. వర్గ పోరుకు తెరపడినట్టేనా?
ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్య సయోధ్య కుదిరినట్టేనా?
ప్రస్తుతం రెండు వర్గాల అనుచరుల మధ్య ప్రధానంగా సాగుతున్న చర్చ ఇదే..!
విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తిగా, బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆపార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షునిగా కొనసాగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆశీస్సులతో హుజురాబాద్ శాసనసభ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.
అదే ఉప ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీని వీడి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి తదనంతరం శాసనమండలి సభ్యునిగా, ప్రభుత్వ విప్ గా నియమితుడై నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాలు తన కనుసన్నల్లో ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలను గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో రెండు వర్గాలు ఎవరి దారి వారిదే అన్నట్టు.. వ్యవహారాలు నడుపుతూ వస్తున్నారు. వివిధ సందర్భాలలో పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ వర్గాల మధ్య ఫ్లెక్సీల యుద్ధం పోటాపోటీగా నడిచింది.
కొంతకాలం క్రితం కమలాపూర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు బహిరంగ వేదికగా కౌశిక్ రెడ్డికి అనుకూల సంకేతాలు ఇచ్చారు. అయినప్పటికీ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆయన వర్గం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ తానే పోటీ చేస్తానంటూ.. శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పాడి కౌశిక్ రెడ్డి వీణవంక మండల కేంద్రానికి చెందిన వ్యక్తికాగా, శ్రీనివాస్ యాదవ్ అదే మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామ వాస్తవ్యుడు. ఒకే మండలానికి చెందిన ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నించినా, అది ఎంత మేరకు సఫలీకృతం అవుతుందన్నది ప్రశ్నార్థకమే.
నియోజకవర్గంలో పార్టీని మొదటి నుండి అంటిపెట్టుకొని ఉన్నవారికి, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మధ్య ఉన్న అంతరాలు.. నేతలిద్దరి సయోధ్య కారణంగా సమసిపోతాయని భావించలేమంటున్నారు.ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇప్పటికే నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి ఆయన అనుచరుల పెత్తనం కొనసాగు తోందని, నియామకాల విషయంలోనూ మొదటి నుండి పార్టీలో పని చేస్తున్న వారికి అన్యాయం జరుగుతుందని మండి పడుతున్న వారు లేకపోలేదు.
హుజురాబాద్ నియోజకవర్గంలో బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వం కంటిలో నలుసు మాదిరి తయారయ్యారు. ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు కోట్లు కుమ్మరించినా, అనేక తాయిలాలు ఇచ్చినా, అలవికాని వాగ్దానాలు చేసినా అధికార పార్టీ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
కనీసం వచ్చే ఎన్నికల్లో ఉప ఎన్నిక ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న అధికార పార్టీకి…
సొంత పార్టీలోని అసమ్మతి తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో సంతృప్తి చెంది అధిష్టానం చెప్పిన మాట వింటారా? లేక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది ఖాయమని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.