Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తొక్కి పెట్టి ఏ మొఖం పెట్టుకొని ప్రధాని మోడీ వస్తున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బిజెపి, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
హనుమకొండలో మంగళవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జులు ఇనుగాల వెంకటరామిరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళన చేస్తున్నట్లు బిఆర్ఎస్ ప్రజలను నమ్మిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీని 9 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
బిజేపికి బి టీంగా పనిచేసిన బిఆర్ఎస్ పార్టీ కోచ్ ఫ్యాక్టరీని ప్రకటిస్తేనే రావాలని మాట్లాడుతున్నారని, మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం చేయాలని నాటకానికి తెరలేపారన్నారు.
మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయనీ కొత్త నాటకానికి పూనుకుంటున్నారని విమర్శించారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు లోపాయి కారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతూ నటిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ POH షెడ్ ప్రారంభించడానికి ప్రధాని వస్తున్నాడని వ్యాగన్ మ్యాను ఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్, నెలకు రెండు వందలు వ్యాగన్లు తయారయ్యే యూనిట్ ప్రకటించ బోతున్నాడని చెప్పారని గుర్తుచేశారు. ఈ యూనిట్‌కి ఏమైనా జి.ఓ. విడుదల చేశారా ? ఎంత బడ్జెట్ కేటాయించనున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.
2009 లోనే కాంగ్రెస్ పార్టీ వ్యాగన్ మ్యాను ఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ ఇచ్చింది. బిజేపి కొత్తగా ప్రకటించేది ఏముందన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో తెలంగాణాలో తన మనుగడను కొనసాగించుకునేందుకు శంకుస్థాపనల పేరిట బీజేపీ ముందుకు వస్తున్నారని విమర్శించారు.
టెక్స్ టైల్ పార్కు ల్యాండ్ అలాట్మెంట్ లో స్కాం జరిగిందన్నారు. ఎక్స్ పీరియన్స్ లేని కంపనీలకు 300 ఎకరాలు 30 కోట్లకు ఇచ్చారు. దాంట్లో 300 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా చల్ల ఇంట్రా కు కూడా ఎక్సెస్ లో 153కోట్ల వర్క్ లు ఇచ్చారు. బిజేపి వాళ్ళు మీరు మొగోళ్ళు అయితే ఈ విషయంలో CBI చే ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ చైర్మన్ బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామకృష్ణ, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా INTUC చైర్మన్ కూర వెంకట్, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం తదితరులు పాల్గొన్నారు.