Warangal | వర్ధన్నపేట ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ

Warangal వర్ధన్నపేట బీఆర్ఎస్‌లో లుకలుకలు టికెట్ ఇవ్వద్దంటూ అభ్యంతరం కార్యకర్తల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధులు అంటే చులకన బీఆర్ఎస్ జిల్లా నేతలకు ఫిర్యాదు అసమ్మతి నేతలకు బుజ్జగింపులు తల పట్టుకుంటున్న అధిష్టానం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్‌ను అసమ్మతి సెగ చుట్టుముట్టింది. వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న లుకలుకలు బహిర్గతమయ్యాయి. నిన్నటి వరకు ఆరూరి చుట్టూ తిరిగిన నాయకులే అసమ్మతిగా […]

Warangal | వర్ధన్నపేట ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ

Warangal

  • వర్ధన్నపేట బీఆర్ఎస్‌లో లుకలుకలు
  • టికెట్ ఇవ్వద్దంటూ అభ్యంతరం
  • కార్యకర్తల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం
  • ప్రజా ప్రతినిధులు అంటే చులకన
  • బీఆర్ఎస్ జిల్లా నేతలకు ఫిర్యాదు
  • అసమ్మతి నేతలకు బుజ్జగింపులు
  • తల పట్టుకుంటున్న అధిష్టానం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్‌ను అసమ్మతి సెగ చుట్టుముట్టింది. వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న లుకలుకలు బహిర్గతమయ్యాయి. నిన్నటి వరకు ఆరూరి చుట్టూ తిరిగిన నాయకులే అసమ్మతిగా మారి, ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అండగా నిలిచిన వారే అసమ్మతి

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఆరూరి రమేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందేందుకు కృషిచేసిన నాయకులే అసమ్మతి స్వరం పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసమ్మతి నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఆరూరి రమేష్ కు ఈసారి టికెట్ ఇస్తే అంగీకరించే సవాలే లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.

పైగా ఆయన తీరుపై వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వరంగల్ జిల్లా పరిధిలో సమస్యలు వస్తే పరిష్కరించే అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న ఎమ్మెల్యే రమేష్‌కే ఇప్పుడు గడ్డు పరిస్థితి వచ్చింది.

ఆరూరిపై.. ఆరోపణలు

రెండు పర్యాయాలు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఆరూరి రమేష్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు సార్లు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇటీవల వరకు మూడవ పర్యాయం కూడా రమేష్ బరిలో ఉంటారని అంతా భావించారు. ఈ సమయంలో ఒక్కసారిగా అసమ్మతి వెలుగు చూడడం, ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో, ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని భావిస్తున్న రమేష్ ఆశలెలా నెరవేరుతాయోనని చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా రమేష్ పై పలు రకాల ఆరోపణలు గత కొంతకాలంగా నియోజకవర్గంలో వస్తున్నప్పటికీ, అసమ్మతి వర్గం ఫిర్యాదుతో ఇప్పటివరకు రమేష్ అనుసరించిన విధానాలు విమర్శలకు తావిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలం నుంచి రమేష్ ఎవరిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు ఉన్నాయి.

రెండవ పర్యాయం ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో తన పద్ధతి మార్చుకుంటానని చెప్పినప్పటికీ, రెండవసారి గెలవగానే మళ్లీ యధావిధిగా ఎవరిని లెక్కలోకి తీసుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ కాలంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అంటే ఆయనకు లెక్కే లేదని చెబుతున్నారు.

పార్టీ కార్యకర్తలు నాయకులను పరిగణలోకి తీసుకోకుండా తన ఇష్టానుసారం తన అనుకూలురకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అంటే ఆయన దృష్టిలో లెక్కలేదని, అందరినీ చులకనగా చూస్తూ, బూతులు తిట్టడం ఆయనకు రివాజుగా మారిందని చెబుతున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను కూడా అనుచరులకు, తన వర్గానికి కేటాయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. దీనికి తోడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన ఆరూరి రమేష్ ను వర్ధన్నపేట కు తీసుకొచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరిని కించపరుస్తున్నారని విమర్శిస్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఆరూరి పై నాన్ లోకల్ ముద్ర తెరపైకి వచ్చింది. వీటికి అదనంగా ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో రమేష్ తన కుమారుడి ని తిప్పుతూ అందరిపై అధికారం చలాయించే విధంగా ప్రోత్సహిస్తున్నాడని విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుణ్ణి రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇంతకాలం తను ఏది అనుకుంటే అది చేసిన రమేష్ కు ఒక్కసారిగా అసమ్మతి నాయకులు ఉచ్చు బిగిస్తున్నారు. రమేష్ కు టికెట్ ఇస్తే తామంతా పనిచేయమంటూ తేల్చి చెబుతున్నారు. నిన్నటి వరకు నియోజకవర్గంలో తనకు ఎదురు లేదని భావించిన రమేష్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది. ఆయనపై మరికొన్ని ఆరోపణలు కూడా అసమ్మతినేతలు చేస్తున్నారు.

పెరుగుతున్న అసమ్మతి నాయకుల సంఖ్య

ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న అసమ్మతి నేతల్లో డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, రైతు సేవా సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలిత యాదవ్, పలువురు ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అసమ్మతి నాయకులంతా ఇటీవల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే తీరు నచ్చని ప్రజాప్రతినిధులు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఏకం చేస్తున్నారు.

ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసిన అసమ్మతి నాయకులు

ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం అసమ్మతి నేతలు ఇప్పటికే చేపట్టారు. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి రమేష్ కు టికెట్ ఇవ్వకూడదు అంటూ ఫిర్యాదు చేశారు. అదే రోజు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను కూడా కలిసి పరిస్థితిని వివరించారు. ఈ ఇద్దరు నేతలు వర్ధన్నపేట నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి, ఆరూరి రమేష్ తీరుపై అధిష్టానానికి వివరించినట్లు చెబుతున్నారు.

అసమ్మతికి బుజ్జగింపులు

అసమ్మతి వర్గం నాయకులను బుజ్జగించే ప్రయత్నం ఈ నాయకులు చేసినప్పటికీ వారు మాత్రం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు తోడు సొంత పార్టీలోనే రాజుకుంటున్న కుంపట్లు బి ఆర్ ఎస్ పార్టీకి, అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.