Warangal
విధాత: మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా(69) అనారోగ్యంతో మృతి చెందారు. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, డయాబెటీస్, బీపీ వంటి సమస్యలతో గత కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయన గత నెల 31న బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు గుండెపోటుకు గురై మరణించినట్టు పార్టీ కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో వివరిచారు.
ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, కార్యకర్తలు, దళ కమాండర్లతో పాటు వందలాది మంది సుదర్శన్ స్మారక సభ నిర్వహించిన అనంతరం విప్లవ సాంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు అభయ్ పేర్కొన్నారు. కటకం సుదర్శన్ మరణంపై పార్టీ కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించినట్టు తెలిపారు. జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, విద్యా సంస్థల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో ఆనంద్ స్మారక సభలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓ కార్మిక కుటుంబంలో జన్మించిన కటకం సుదర్శన్ బెల్లంపల్లిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వరంగల్‌లో పాలిటెక్నిక్ చదివారు. ఆ రోజుల్లోనే ఆయన మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా చేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా ఆయన పనిచేశారు. ఈ సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో సుదర్శన చురుకైన పాత్ర పోషించారు.
1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్‌గా రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి కటకం ప్రాతినిథ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన.. 2001లో రెండోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
సుదర్శన్ సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా 2017 వరకు పనిచేశారు. అనంతనరం పలు అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గెరిల్లా పోరాటంలో దిట్ట అయిన కటకం సుదర్శన్‌ను ఆనంద్, మోహన్, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పనిచేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 2013లో కాంగ్రెస్ నేతలపై మావోల దాడిలో 27 మంది మరణించారు. ఈ భారీ దాడి వెనుక వ్యూహకర్త కటకం సుదర్శన్. ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యం వరకు మావోయిస్టు కార్యకలాపాల్లో సుదర్శన్ కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు.
ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు. కొంతకాలం టీచర్‌గా కూడా పనిచేశారు. ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా సీపీఐ(మావోయిస్టు) సెక్రటరీ సాధనను వివాహం చేసుకున్నారు.