Warangal | సంచలనంగా మారిన తాడ్వాయి ‘ఉపా’ దేశద్రోహం కేసులు.. ఏడాది తర్వాత వెలుగులోకి..

Warangal గతేడాది ఆగస్టు 19న తాడ్వాయి పోలీసు స్టేషన్లో కేసు నమోదు 140 మందికిపైగా నిందితులు ప్రొఫెసర్లు హరగోపాల్, పద్మజాషా పౌరహక్కుల నేతలు గడ్డం లక్ష్మణ్, నారాయణ ముంబై హైకోర్టు జడ్జి సురేశ్ పై కేసు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు గత ఏడాది పెట్టిన 'ఉపా' కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక కేసు విషయంలో విచారణ సందర్భంగా ఈ కేసు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా […]

  • Publish Date - June 15, 2023 / 04:38 PM IST

Warangal

  • గతేడాది ఆగస్టు 19న తాడ్వాయి పోలీసు స్టేషన్లో కేసు నమోదు
  • 140 మందికిపైగా నిందితులు
  • ప్రొఫెసర్లు హరగోపాల్, పద్మజాషా
  • పౌరహక్కుల నేతలు గడ్డం లక్ష్మణ్, నారాయణ
  • ముంబై హైకోర్టు జడ్జి సురేశ్ పై కేసు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు గత ఏడాది పెట్టిన ‘ఉపా’ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక కేసు విషయంలో విచారణ సందర్భంగా ఈ కేసు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో రాష్ట్రంలోని ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు పద్మజా షా, పౌర హక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్, నారాయణ, ముంబైకి చెందిన జడ్జి సురేష్, అడ్వకేట్లు చిక్కుడు ప్రభాకర్ తదితరులతో పాటు పలువురు ప్రొఫెసర్లు వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రముఖులు ఉండడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది.

కేసు పెట్టి ఏడాది కావస్తున్నా ఎందుకు పోలీసులు మౌనంగా ఉన్నారు అర్థం కాని ప్రశ్నగా నెలకొంది. తాడ్వాయి పోలీస్ స్టేషన్లో 141 మంది పై నమోదైన కేసుకు సంబంధించి వివరాలు ఉన్నాయి

ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ప్రభుత్వ అధికారులను, పోలీసులను, ప్రజా ప్రతినిధులను చంపడానికి నిషేధిత మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర పన్నినట్లు గతేడాది ఆగస్టు 19న నమోదు చేసిన ఎఫ్ఎఆర్లో స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

141 మంది పై కేసు నమోదు

మొత్తం 141 మందిపై ఐపీసీ (భారత శిక్షాస్మృతి)లోని సెక్షన్ 120-బీ, 147, 148 రెడ్ విత్ 149, ‘ఉపా’ చట్టంలోని సెక్షన్లు 10, 13,18, 20, 38, ఆర్మ్స్ యాక్టులోని సెక్షన్ 25-1-బి-ఏ నమోదు చేసినట్లు ఆ
ఎఫ్ఎర్లో పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల వారిపై కూడా

రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాల ప్రొఫెసర్లు,ప్రజా సంఘాల నాయకులు, పౌరహక్కుల సంఘం కార్యకర్తలు, న్యాయవాదులు, జడ్జి, మహిళా సంఘాల యాక్టివిస్టులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి పోలీసు స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం దగ్గర 2022 ఆగస్టు 19 తెల్లవారుజామున 5 గంటలకు నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యులతో వీరంతా సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. దళ సభ్యులను లొంగి పోవాల్సిందిగా హెచ్చరించినా లెక్క చేయక అడవిలోకి పారిపోయారు.

తనిఖీ సందర్భంగా సాహిత్యంతో పాటు మొత్తం పది రకాల వస్తువులు లభ్యమయ్యాయి. వీరంతా అప్పుడు సమావేశంలో ఉన్నారని యాక్షన్లో పాల్గొన్న ఎస్సై శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లు ఎఫ్ఎస్ఐఆర్ను నమోదు చేశారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు మొత్తం 20 సంఘాలకు చెందినవారిని నిందితులుగా పేర్కొన్నారు.

మృతి చెందిన వారిపై కేసు

ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన హెచ్.సురేశ్ పేరును సైతం ఎఫ్ఐఆర్‌లో పొందుపర్చడం గమనార్హం. జస్టిస్ సురేశ్ (90 సంవత్సరాలు) 2020 జూన్ 19న చనిపోయారు. కానీ రెండేండ్ల తర్వాత ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడాన్ని పౌరహక్కుల సంఘం నేతలు తప్పుపడుతున్నారు. ఈ కేసు పై ప్రజాస్వామ్య సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని ప్రశ్నిస్తున్నారు.