BJP – BRS | ఆ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతున్నది?
BJP - BRS | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా నిన్నజరిగిన రాజకీయ పరిణామాలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. పాట్నా వేదికగా పదిహేను పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరం పూరించాయి. సిద్ధాంతపరంగా ఒక్కో పార్టీకి ఒక్కో విధానమైనా పార్టీల ప్రయోజనాల కంటే దేశమే ముఖ్యమని దాదాపు అన్నిపార్టీలు అంగీకరించాయి. ఇందులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విభేదాలు ఉన్నప్పటికీ పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలని సమావేశంలో […]

BJP – BRS |
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా నిన్నజరిగిన రాజకీయ పరిణామాలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. పాట్నా వేదికగా పదిహేను పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరం పూరించాయి. సిద్ధాంతపరంగా ఒక్కో పార్టీకి ఒక్కో విధానమైనా పార్టీల ప్రయోజనాల కంటే దేశమే ముఖ్యమని దాదాపు అన్నిపార్టీలు అంగీకరించాయి.
ఇందులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విభేదాలు ఉన్నప్పటికీ పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలని సమావేశంలో పార్టీలు నిర్ణయించాయి. ప్రతిపక్షాలను ఐక్యంగా ఉంచేందుకు తమ పార్టీ ఏం చేసేందుకైనా సిద్ధమని రాహుల్ స్పష్టం చేశారు. విపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించాలని సూచించారు. అంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని విపక్ష నేతల మాటలను బట్టి అర్థమౌతున్నది.
అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గోవా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. తెలంగాణలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మమత బెనర్జీ చెప్పారు.
విపక్షాల భేటీ రోజే మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కావడమే దీనికి కారణం. ఇది యాధృచ్ఛికంగా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్లినప్పుడు బీఆర్‌ఎస్ మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోగా.. ఇచ్చినా వారిని పెద్దగా పట్టించుకోలేదు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల మధ్య జరిగిన ఉదంతమంతా తెలిసిందే.
బీజేపీ పాలనలో రాజ్యాంగమూల స్తంభాలపై దాడి జరుగుతున్నదని, దేశ చరిత్రను మార్చాలనుకుంటున్న ఆ పార్టీని గద్దె దించాలనుకుంటున్న సమయంలో మంత్రి కేటీఆర్ విపక్షాల ఐక్యత కాదు ప్రజల ఐక్యత కోరుకుంటున్నామనడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం రక్షణ భూములను అప్పగించాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి చెప్పారు. అయితే అది కుదరదని కేంద్రం ఇప్పటికే అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
విపక్షాల భేటీ రోజే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రులను కలవడం వెనక ఏదో రాజకీయ ఉద్దేశం ఉండే ఉంటుందంటున్నారు. ఈ రెండు పార్టీలు లోపల ఒకరకంగా, బయటికి మరో రకంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నది నిజమే అంటున్నారు. బీజేపీపై కొంతకాలంగా ఒంటికాలిపై లేస్తున్నబీఆర్‌ఎస్ వైఖరి అనేక అనుమానాలకు ఆజ్యం పోస్తున్నది. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు లోపాయికారిగా ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.
అంతేకాదు బండి సంజయ్ నిన్న మొన్న కేసీఆరే కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని ఆరోపించారు. అయితే ఇదంతా ఈ రెండు వ్యూహంలో భాగంగానే ఆయన ఇలాంటి కామెంట్లు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇక పార్టీలోకి వచ్చినా అందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం అభ్యర్థుల కొరత ఉన్నది బీజేపీలోనే.
అందుకే బీఆర్‌ఎస్‌లోని నేతలను బీజేపీలోకి పంపి ఆ పార్టీ నుంచే పోటీ చేయిస్తారనని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అందుకే సంజయ్ బీఆర్‌ఎస్ ఫథకాలను కొనసాగిస్తామని, ధరణి పోర్టల్ రద్దు చేయమని అన్నారని, అంతేకాదు కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. ఈ ఉదంతాలు చూస్తే ఆ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతున్నదనేలా ఉన్నాయి అంటున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీనే ఉన్నది. అలాగే బీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీనే తమ తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నది. అయితే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఫిరాయించేలా ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచింది కేసీఆరే. ఫలితంగా హైదరాబాద్‌లోని కొన్ని నియోజకవర్గాలు, ఇతర కొన్నిచోట్ల మాత్రమే కొంత బలం ఉన్న బీజేపీ విస్తరించడానికి కేసీఆర్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలే దోహదపడినాయనే విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని పాలనలో దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ బీజేపీ పరోక్షంగా సహకరించేలా వ్యవహరిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనుకుంటున్న మోడీ-షాలకు సహకరించేలా ఆ పార్టీ రాజకీయ నిర్ణయాలు ఉంటున్నాయని అభిప్రాయపడతున్నారు. ఇది రానున్నరోజల్లో తెలంగాణ భారీ నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.