Notifications: టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు ఎప్పుడు? 3.5 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు

పది నెలలుగా 3.5 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం కాలయాపన పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి, సీఎస్‌ అనేకసార్లు ప్రకటన.. సీఎం గత ఏడాది ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి లభించని ఆర్థిక శాఖ అనుమతి విధాత‌: రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని 2022 మార్చిలో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వాటిలో ఇప్పటివరకు 64 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇందులో దాదాపు […]

Notifications: టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు ఎప్పుడు? 3.5 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు
  • పది నెలలుగా 3.5 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు
  • కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం కాలయాపన
  • పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి, సీఎస్‌ అనేకసార్లు ప్రకటన..
  • సీఎం గత ఏడాది ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి లభించని ఆర్థిక శాఖ అనుమతి

విధాత‌: రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని 2022 మార్చిలో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వాటిలో ఇప్పటివరకు 64 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇందులో దాదాపు 60 వేల పోస్టులకు టీఎస్‌పీఎస్సీ, ఇతర నియామక బోర్డులు నోటిఫికేషన్లు జారీ చేశాయి.

ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇంకా 16 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ ఖాళీలలో విద్యాశాఖ పరిధిలోనే 13,086 పోస్టులు భర్తీ చేయనున్నట్టు సీఎం ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు సుమారు 10 వేల వరకు ఉంటాయని అంచనా. ఆదర్శ పాఠశాలల్లో మరో వెయ్యి వరకు, మిగిలినవి బీఎడ్‌, డైట్‌ కాలేజీల్లో, ఎస్‌ఈఆర్‌టీతో పాటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ లో ఉన్నాయి.

ఈ టీచర్‌ పోస్టుల భర్తీ కోసం 3.5 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖాళీల గురించి మాట్లాడుతున్నది కానీ విద్యాశాఖకు సంబంధించి ప్రకటలకే పరిమితమౌతున్నది. టీచర్‌ పోస్టులకు పోటీ పడాలంటే ఏటా టెట్‌ రెండు సార్లు నిర్వహించాలి. కానీ ప్రభుత్వం ఈ టెట్‌ నిర్వహించడానికి ఆసక్తి చూపలేదు.

దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో 2022 జూన్‌ 12న టెట్‌ నిర్వహించింది. టెట్ జరిగి 10 నెలలు గడిచాయి. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని సీఎస్‌, మంత్రి ఇప్పటికీ అనేక సార్లు ప్రకటించినా దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించలేదు.

అక్షరాస్యతతో మన రాష్ట్రంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడో చివరి మూడు నాలుగు స్థానాల్లో ఉన్నది. అయినా ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ పోస్టులను భర్తీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది.

ప్రభుత్వం ఆమధ్య ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టింది. ఆ తర్వాత నియామకాలు చేపడుతుందని ఆశావహులు ఎదురు చూశారు. ఆ ప్రకియ వివాదాస్పదం కావడంతో ఉపాధ్యాయులంతా రోడ్లపైకి వచ్చారు. హైదరాబాద్‌లో మంత్రుల నివాసాల ముందు, ప్రగతి భవన్‌ ముట్టడికి కూడా యత్నించారు. అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ ప్రక్రియకు కోర్టు బ్రేకులు వేసింది. ఆ కేసు జూన్‌ 13న విచారణకు రానున్నది.

కోర్టు తీర్పు, ఆ తర్వాత బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తర్వాత టీచర్‌ కొలువుల కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే అది జరిగే పనికాదు. ఎందుకంటే ఈ ఎన్నికలకు ఇంకో ఏడెనిమిదేళ్ల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పటికే ప్రకటించిన అనేక నోటిఫికేషన్లు పేపర్‌ లీకేజీలతో కథ మొత్తం మళ్లీ మొదటికి వచ్చిన సంగతి తెలిసిందే. టెట్‌ నిర్వహించి, టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు ఏమీ లేవు.

కానీ ప్రభుత్వం కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేస్తున్నదే గాని భర్తీ చేయాలనే ఆలోచన లేదని నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పటికే టీచింగ్‌, నాన్‌టిచింగ్‌ పోస్టుల భర్తీ లేక వర్సిటీలు నిర్వీర్యg అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.