అధ్యక్షుడు సరే.. పార్టీ ఎక్కడుంది బాబూ!

ఉన్నమాట: రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, వైసీసీపీలు తెలంగాణలో కొన్ని సీట్లు, ఓట్లు వచ్చినా ఆ పార్టీల మనుగడ కష్టమే. ఎందుకంటే ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే ఆ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్ట లేవన్నది ఇక్కడి ప్రజల అభిప్రాయం. అందుకే ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆ పార్టీలకు ప్రాధాన్యం చాలా తగ్గిపోయింది. వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. […]

  • By: krs    latest    Nov 05, 2022 2:48 PM IST
అధ్యక్షుడు సరే.. పార్టీ ఎక్కడుంది బాబూ!

ఉన్నమాట: రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, వైసీసీపీలు తెలంగాణలో కొన్ని సీట్లు, ఓట్లు వచ్చినా ఆ పార్టీల మనుగడ కష్టమే. ఎందుకంటే ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే ఆ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్ట లేవన్నది ఇక్కడి ప్రజల అభిప్రాయం. అందుకే ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆ పార్టీలకు ప్రాధాన్యం చాలా తగ్గిపోయింది. వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ అయితే 2014లో తెలంగాణలో పోటీ చేసి ఖమ్మం పార్లమెంటు స్థానంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ ఎమ్మెల్యేలు, ఎంపీ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చమని వైసీపీ తేల్చిచెప్పింది. కానీ టీడీపీ చంద్రబాబు మాత్రం అప్పుడప్పుడు తెలంగాణలో పర్యటిస్తూ.. నేతలతో సమావేశమౌతూ.. ఇక్కడ ఆ పార్టీ బలంగా ఉన్నదని ప్రకటనలు చేస్తుంటారు.

ఆయన వ్యాఖ్యలు మీడియాలో వచ్చినా ఇక్కడి ప్రజలు గాని, ఆ పార్టీ నేతలు గాని సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే బాబు ప్రచార ఆర్భాటం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎల్‌ రమణలతో పాటు చాలామంది సీనియర్లు నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల్లో చేరిపోయారు. తర్వాత టీడీపీ ఇక తెలంగాణలో ఉనికి ప్రశ్నార్థకంగానే మారింది.

ఇక తాజాగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్‌ బ్యూరోలో స్థానం కల్పించి, ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే టీడీపీ అంటే బడుగు బలహీనవర్గాల పార్టీ అని, ఆయా వర్గాలకు పెద్ద పీట వేస్తుందని చెప్పుకునే ప్రయ్నతం చేస్తారు.

కానీ ఆ పార్టీ మూలాలు ఏపీలో ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ఐదేళ్ల పాటు ఏపీ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడానికి శ్రమిస్తున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే ఏపీలోనే ఆ పార్టీ జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తే తప్పా వైసీపీని ఎదుర్కొవడం కష్టమే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఈ సందర్భంలో ఆయన ఇంకా తెలంగాణపై ఆశలు పెట్టుకోవడం, ఇక్కడ ఏదో సాధిస్తామని అనుకోవడం భ్రమే అవుతుందని అంటున్నారు. అంతేకాదు బాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు కదా. ఒక రాష్ట్రానికే తన పార్టీ పరిమితం కాలేదని చెప్పుకోవడానికి తెలంగాణలో ఒక శాఖను కొనసాగిస్తున్నారు. కానీ తెలంగాణ ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నారా వారికి తెలియదా అని వ్యంగ్యంగా స్పందిస్తున్న వారూ ఉన్నారు. – రాజు ఆసరి