కేడర్ ను కలవరపరుస్తున్న కాంగ్రెస్ వర్గ పోరు.. విపక్షంలో ఉండి కూడా ఎందుకీ పంచాయతీ అంటున్న కేడర్ !! విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం జట్టుగా పని చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలు అసమ్మతి మాటల మంటల దాడులతో ప్రజల్లో పలచన అవుతున్న తీరు ఆ పార్టీ కేడర్‌ను నిరాశకు గురిచేస్తుంది. సీఎం కేసీఆర్ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధపడవచ్చన్న వాతావరణం ఒకవైపు ఉంటే… ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకునేందుకు పోరాడవలసిన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకత్వం […]
విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం జట్టుగా పని చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలు అసమ్మతి మాటల మంటల దాడులతో ప్రజల్లో పలచన అవుతున్న తీరు ఆ పార్టీ కేడర్‌ను నిరాశకు గురిచేస్తుంది. సీఎం కేసీఆర్ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధపడవచ్చన్న వాతావరణం ఒకవైపు ఉంటే… ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకునేందుకు పోరాడవలసిన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకత్వం అంతర్గత కలహాలతో ఆగమవుతుండటంతో అసలు అధికారం మాటేమిటో గాని మళ్లీ ప్రధాన ప్రతిపక్ష హోదా యైన దక్కుతుందో లేదో నన్న ఆందోళన కాంగ్రెస్ కార్యకర్తల్లో వినిపిస్తుంది.
పార్టీకి పెద్దదిక్కుగా ఉండి ఎన్నికల దిశగా పార్టీని ముందుకు దూకించాల్సిన సీనియర్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కి, శ్రీధర్ బాబు వంటి ఉద్దండ నేతలంతా కాంగ్రెస్ హై కమాండ్ నియమించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తడం పార్టీ భవిష్యత్తుకు ప్రతికూలంగా మారింది.
BIGGBOSS: బిగ్ బాస్ సీజన్-6 విజేత రేవంత్
రేవంత్ హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ సీనియర్లు రచ్చకెక్కగా… సీనియర్లు పార్టీని నాశనం చేస్తున్నారని కోవర్టులుగా తయారయ్యారని రేవంత్ వర్గం ఆరోపిస్తూ పార్టీలో సంక్షోభానికి ఆజ్యం పోస్తుంది. మీరు కోవర్టులంటే మీరు కోవర్టులంటూ రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గీయులు బహిరంగ విమర్శలకు దిగగా… అసలు ఎవరు కోవర్టులు.. ఎవరు నిజమైన కాంగ్రెస్ వాదులో అర్థం కాక కాంగ్రెస్ కేడర్ అయోమయంతో పార్టీ దుస్థితిని చూసి తలలు పట్టుకుంటుంది.
రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన రేవంత్ రెడ్డి తనపై అసమ్మతి వెళ్ల గక్కుతున్న సీనియర్లను ఏదోరకంగా తన దారికి తెచ్చుకొని.. సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో పార్టీని గట్టెక్కించాలి. కానీ అందుకు విరుద్ధంగా.. తనను ప్రశ్నించిన పార్టీ సీనియర్లపై తన అనుచరులతో కౌంటర్ ఎటాక్ చేస్తూ పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని మరింత రగిలించేలా చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లకు, రేవంత్ రెడ్డి వర్గీయులకు మధ్య జరుగుతున్న పోరును కాంగ్రెస్ అధిష్టానం సైతం సకాలంలో పరిష్కరించలేని దుస్థితి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తుకు గుదిబండగా మారింది. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ, పార్ట్ టైం అన్నట్లుగా పార్టీ వ్యవహారాల్లో కనిపించే ప్రియాంక గాంధీలలో ఎవరికి కూడా తెలంగాణ కాంగ్రెస్ గొడవలను పట్టించుకునే సమయం.. ఆసక్తి ఉన్నట్లుగా కనిపించకపోవడంతో అసమ్మతి స్వరాలు ఎప్పటికప్పుడు ఉదృతం అవుతూనే ఉన్నాయి.
పార్టీల నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కనీసం ఏఐసీసీ నూతన అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గే అయినా తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభాన్ని చక్కదిద్దుతారా అంటే గాంధీ కుటుంబాన్ని కాదని స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారనుకోవడం అతిశయోక్తి గానే అనిపిస్తుంది.
2014, 2018 ఎన్నికలలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఎన్నికలను ఎదుర్కొని ఘోర ఓటమి చవిచూడడం.. తదుపరి 12 మంది పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పటికీ పీసీసీ సారథిని మార్చడంలో జాప్యం చేసి ఒక రకంగా కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్రంలో పార్టీ పురోగతిని దెబ్బతీసింది.
చివరకు సొంత పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను కాదని సొంత సర్వే ప్రభావమో లేక మిత్రపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు సూచనతో ఏమోగానీ టీడీపీ నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీప్ గా నియమించి కాంగ్రెస్ హైకమాండ్ మరో ప్రయోగం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధన కోసం రేవంత్ నాయకత్వం పై హైకమాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. రేవంత్ మాత్రం తన ఒంటెద్దు పోకడలు.. తన వెంట కాంగ్రెస్ లోకి వచ్చిన టీడీపీ వలసనేతలతో ఒక వర్గంగా మారి, ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాలను ప్రోత్సహించడంతో పార్టీ పరిస్థితి మెరుగు పడలేకపోగా అంతర్గత కలహాలతో మరింత క్షీణించింది.
అటు ఉప ఎన్నికల్లో వరుస ఓటములు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి వంటి సీనియర్లు ఒక్కొక్కరు పార్టీ వీడిపోతున్నా నష్ట నివారణ చర్యల దిశగా సకాలంలో దిద్దుబాటు చర్యలకు హైకమాండ్ ఉపక్రమించలేకపోవడం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చింది.
తాజాగా రేవంత్ రెడ్డి వేసిన నూతన పిసిసి, పిఎసి కమిటీలతో పార్టీలో అంతర్గత అసమ్మతి ఈ దఫా సీనియర్ల రూపంలో బహిర్గతమవ్వడం.. ఏకంగా రేవంత్ హటావో.. కాంగ్రెస్ బచావో అంటూ, సేవ్ కాంగ్రెస్ అంటూ, ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు.. వలసవాదులకు మధ్య యుద్ధం అంటూ పార్టీ అస్థిత్వానికి సవాల్ విసిరే స్థాయిలో అసమ్మతి భగ్గుమంది.
అయినప్పటికీ పార్టీ హై కమాండ్ ఎప్పటి మాదిరిగా అసమ్మతి పరిష్కార చర్యల్లో జాప్యం చేస్తుండటం సగటు కాంగ్రెస్ కార్యకర్తను నిరాశకు గురిచేస్తుంది. తాము నియమించిన టి. కాంగ్రెస్ అధ్యక్షుడి కార్యకలాపాలను బహిష్కరించే స్థాయిలో సీనియర్లంతా ఒక్కటై అసమ్మతి వ్యక్తం చేసినా ఢిల్లీ హై కమాండ్ ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న సీనియర్లనే కాకుండా కార్యకర్తలను సైతం విస్మయపరుస్తుంది.
టీ కాంగ్రెస్ లో రేగిన తాజా కల్లోలం సద్దుమణుగుతుందా లేక పార్టీకి మరింత చేటు కలిగించే దిశగా మరిన్ని తీవ్ర పరిణామాలకు దారితీస్తుందా.. ఈ సంక్షోభంలో అసలు కోవర్టులు ఎవరు.. నిజమైన కాంగ్రెస్ వాదులు ఎవరో తేలాలంటే వేచి చూడాల్సి ఉంది.