పర్యావరణానికి అడవి దున్నల దన్ను.. కర్బన ఉద్గారాల సంగ్రహణలో సాయం
నేషనల జియోగ్రాఫిక్ ఛానల్, డిస్కవరీ వంటి ఛానళ్లలో ఎక్కువగా కనిపించే దృశ్యం.. అడవి దున్నలదే

విధాత: నేషనల జియోగ్రాఫిక్ ఛానల్, డిస్కవరీ వంటి ఛానళ్లలో ఎక్కువగా కనిపించే దృశ్యం.. అడవి దున్న(Wildebeest) లదే. వేల కొద్దీ దున్నలు కొన్ని వందల కి.మీ. పాటు వలస పోయే దృశ్యాలు చిన్నారులను విపరీతంగా ఆకర్షిస్తాయి. భూమిపై ఏ జీవి చేసే వలసను తీసుకున్నా అడవి దున్నలదే అతి పెద్ద వలస ప్రయాణం. వేసవిల్లో గడ్డిని వెతుక్కుంటూ ఇవి తూర్పు ఆఫ్రికా (Africa) లోని విస్తారంగా ఉన్న సెరెంగెటీ గడ్డి భూముల (Grasslands) ను చేరుకుని తమ ఆకలిని తీర్చుకుంటాయి.
తాజాగా భూమిపై ఉన్న కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించడంలో అడవిదున్నల ప్రాధాన్యంపై ఒక అధ్యయనం వెలువడింది. భూ తాపాన్ని తగ్గించడానికి మనుషులతో పాటు అనేక జీవులు తమకు తెలియకుండానే తోడ్పడుతుండగా వాటిలో దున్నలది మొదటి స్థానమని ఇందులో తేలింది. అడవి దున్నల సంఖ్యను ఒకసారి గమనిస్తే 20వ శతాబ్దం మొదిటి భాగంలో వీటి సంఖ్య భారీగా పడిపోయింది.
రిండెర్‌పెస్ట్ అనే వైరల్ జబ్బు, విపరీతమైన వేట, ఆవాసాలు కొరవడటం వంటి సమస్యలతో వీటి జనాభా పడిపోయి కేవలం 2,40,000 దున్నలు మాత్రమే మిగిలాయి. దీంతో గడ్డి తినే జీవులు ఆఫ్రికాలో లేకపోవడంతో గడ్డి భూముల్లో గడ్డి విపరీతంగా పెరిగిపోవడం ప్రారంభించింది. సాధారణంగా ఇవి కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని కార్బన్ సింక్స్‌గా ఉపయోగపడతాయని తెలిసిందే. కాబట్టి ఇది మంచి విషయంగానే శాస్త్రవేత్తలు భావించారు.
అయితే ఇంత మొత్తంలో ఉన్న గడ్డి ఎండిపోయి.. కార్చిచ్చులు విపరీతంగా చెలరేగేవి. ఇవి అడవులను బూడిద చేయడంతో పాటు జీవజాలాన్నీ నాశనం చేసేవి. ఇలా కార్బన్ సింక్స్ అనుకున్న గడ్డి భూములే.. కార్బన్ ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయాయి. దీంతో అడవి దున్నల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వాలు, పర్యావరణ సంస్థలు వాటి సంఖ్యను పెంచడానికి నడుం బిగించాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం, వేటపై కఠినంగా వ్యవహరించడంతో 70ల నాటికి వాటి సంఖ్య 15 లక్షలకు చేరుకుంది.
దీంతో గడ్డి భూముల్లో సమతౌల్యం ఏర్పడి కార్చిచ్చులు తగ్గాయి. అలాగే వీటి పేడ మంచి ఎరువుగా పనిచేసి అడవుల్లో చెట్లకు సహజ ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా ఒకప్పుడు కార్చిచ్చులకు కారణమైన గడ్డి భూములు ప్రస్తుతం కార్బన్ సింక్స్‌గా ఉపయోగపడుతున్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ప్రతి 10 వేల అడవి దున్నల చర్యల వల్ల భూమిపై విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్‌లో 15 శాతం అధికంగా గడ్డి భూముల శోషించుకుంటున్నట్లు తేలింది.
అడవి దున్నలతో పాటు మరో తొమ్మిది రకాల జంతువులను మనం సంరక్షించినట్లయితే కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఇతోధికంగా ఉపయోగపడతాయని ఈ అధ్యయనం నిర్వహించిన స్కిమిట్జ్ అనే సంస్థ వెల్లడించింది. వీటి ద్వారా 6.41 బిలియన్ టన్నుల కార్బన్‌ను వాతావరణంలోని విడుదల కాకుండా ఆపగలమని పేర్కంద. ప్రపంచదేశాలు పెట్టుకున్న 2050 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం చేరుకోవాలంటే.. సుమారు 10 బిలియన్ టన్నుల ఉద్గారాలను వాతావరణం నుంచి వేరుచేయాలనేది ఒక అంచనా.
స్కిమిట్జ్ సూచించిన ఆ 9 రకాల జంతువుల జాబితాను ఒకసారి చూస్తే.. సముద్ర చేపలు, వేల్స్, షార్క్స్, తోడేళ్లు, అడవి దున్నలు, సీ ఆటర్, మస్క్ ఆక్సిన్, ఆఫ్రికన్ ఏనుగులు, అమెరికన్ బైసెన్‌లు అందులో ఉన్నాయి. ఇవన్నీ వివిధ మార్గాల్లో కార్బన్ డై ఆక్సైడ్‌ను శోషించుకుంటాయని.. కాబట్టి ఆయా దేశాలు ఈ జంతువుల జనాభాను ఇతోధికంగా పెంచాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.