బీజేపీకి ఆ నాలుగు స్థానాలు దక్కేనా..?
విధాత: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది టీఆర్‌ఎస్ అభ్యర్థులే. ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలుపే అన్నది నానుడి. అయితే బీజేపీ నుంచి గెలిచిన నలుగురు అభ్యర్థుల్లో ఎవరికీ లక్ష మెజారిటీ రాలేదు. ముఖ్యంగా బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించడానికి కారణం కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లు అని చేసిన వ్యాఖ్యలే కారణమని సంజయ్‌తో పాటు ఆ పార్టీ నేతలు […]

విధాత: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది టీఆర్‌ఎస్ అభ్యర్థులే. ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలుపే అన్నది నానుడి. అయితే బీజేపీ నుంచి గెలిచిన నలుగురు అభ్యర్థుల్లో ఎవరికీ లక్ష మెజారిటీ రాలేదు. ముఖ్యంగా బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించడానికి కారణం కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లు అని చేసిన వ్యాఖ్యలే కారణమని సంజయ్‌తో పాటు ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తారు.
ఇక కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోయిన నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ గెలవడానికి కారణం వాళ్ల తండ్రి ధర్మపురి శ్రీనివాస్ తెరవెనుక చేసిన వ్యూహాలే అన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల అరవింద్ అన్న సంజయ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఇక మూడో స్థానం ఆదిలాబాద్. అక్కడ గిరిజనులు, లంబాడాల మధ్య నెలకొన్నసమస్యలే ఆయన విజయానికి దోహదపడినాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిచిన కిషన్‌రెడ్డికి చాలా అంశాలు కలిసి వచ్చాయి. బండారు దత్తాత్రేయ అంతకుముందు ఆ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే రెండు సార్లు ఆ స్థానం నుంచి గెలిచిన అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండటంతో చాలా ఓట్లు ఆయన చీల్చడంతో అది కిషన్‌రెడ్డికి లాభించింది అనే వాదన ఉన్నది. ఎందుకంటే అంబర్‌పేట అసెంబ్లీ స్థానం కిషన్‌రెడ్డికి కంచుకోట. అలాంటి స్థానంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గెలుపొందారు.
ఈ క్రమంలో నరేంద్రమోడీ ఫిబ్రవరిలో లోక్‌సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని, గతంలో లానే సొంతంగా మెజారిటీ సాధించడమే కాకుండా ఈసారి 400 మార్క్ దాటేస్తామని ఆ పార్టీ నాయత్వం ధీమా వ్యక్తం చేస్తున్నది. అందుకే ఆ పార్టీ ఎన్నడూ గెలవని 144 స్థానాలపై దృష్టి సారించిందని, ఆ స్థానాల్లో పాగా వేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని అని కొంతకాలంగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
తెలంగాణలో మెజారిటీ స్థానాలపై కన్నేసిన కమలనాథులు గతంలో గెలిచిన నాలుగు స్థానాలను నిలబెట్టు కుంటారా? వీటికి అదనంగా మరిన్ని స్థానాలు గెలుచుకుంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లే బీజేపీపై కూడా అంతే వ్యతిరేకత ఉన్నది. ఎనిమిది న్నరేళ్లలో మోడీ నేతృత్వంలో తీసుకుంటున్న విధాన నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం పెరిగిపోయింది. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.
బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో బీజేపీ గత ఎన్నికల్లో గెలుచుకున్న నాలుగు స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలిగితే అదే ఎక్కువ అనే అభిప్రాయమూ సర్వత్రా వినిపిస్తున్నది.