ఆ రెండు చోట్ల అంచనాలు నిజమౌతాయా? తప్పుతాయా?
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అన్న అంశాన్ని మరికొన్ని గంటల్లో తెరపడనున్నది

విధాత: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? అన్న అంశాలకు మరికొన్ని గంటల్లో తెరపడనున్నది. ఇప్పటివరకు ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేల్చిచెప్పాయి. అయితే మ్యాజిక్ ఫిగర్‌పై ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతున్నది. ప్రధానంగా పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే జరిగినా బీజేపీ కూడా ఈసారి ఓటు శాతాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సాధించిన 46.87 శాతం ఓటు బ్యాంకు నుంచి 32 శాతానికి పడిపోతుందని చాలా సంస్థల ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ 28.43 శాతం నుంచి 42 శాతానికి తన ఓటు బ్యాంకును పెంచుకుంటుందని చెప్పాయి. బీజేపీ ఓట్ల శాతం 6.98 % నుంచి 14 శాతానికి పెరుగుతుందని అంచనా వేశాయి.
కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జేడీఎస్‌పై విరుచుకుపడిన కమలనాథులు ఎన్నికల కౌంటింగ్ మొదలుకాగానే మొదటి రెండు గంటల్లో ట్రెండ్‌ను బట్టి తమకు మెజారిటీ రాకపోతే జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ.. ఈ విషయాన్ని కన్నడ ప్రజలు ఓటింగ్‌కు ముందే పసిగట్టి బీజేపీనే కాదు, జేడీఎస్‌ను కూడా మట్టికరిపించారు. సంక్షోభం తలెత్తకుండా సుస్థిర ప్రభుత్వానికే మద్దతు తెలిపారు. ఫలితంగా అందరి అంచనాలను మించి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించగలిగింది.
అక్కడ వ్యతిరేకత అంశాలు.. ఇక్కడ అభివృద్ధి అంశాలు
అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నది. కానీ కర్ణాటక ఫలితాలే ఇక్కడ వంద శాతం పునరావృతమౌతాయని ఎక్కువ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. ఒకటి రెండు ఎగ్జిట్‌పోల్స్ మినహా మిగిలినవి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్‌ను దాటుతుందని చెప్పాయి. ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో ఎక్కువ మంది సీఎంగా కేసీఆర్‌నే కోరుకుంటున్నా.. ప్రభుత్వ విధానాలు, నియామకాలపై నిరుద్యోగుల ఆగ్రహం, 317 జీవో వల్ల జరిగిన బదిలీలు, పదోన్నతులు, ధరణి వల్ల ఎదురవుతున్న సమస్యలతో ఆయా వర్గాలు, దళితబంధు గ్రామంలో ఒకటిరిద్దరికే రావడం వల్ల దళితులు ప్రభుత్వంపై కోపంతోనే కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
అలాగే బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ఆరోపణలతో ముస్లిం మద్దతు కూడా గణనీయంగా తగ్గింది. బీఆర్‌ఎస్ 2018లో సాధించిన సీట్లు వీటన్నింటి ఫలితంగా సగానికి తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణాలే కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారానికి అవసరమైన మెజారిటీకి దూరం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు భారీ నష్టం జరుగుతుందని ముందునుంచి అందరూ అంటున్నవిధంగానే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ఉన్నాయి.
అలాగే ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతకు, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కారణమైన అంశాలు.. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చేసరికి అప్రధానమయ్యాయి. ఇక్కడ మౌలిక సదుపాయాలు, అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడ బీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. నాంపల్లిలో కాంగ్రెస్‌కు అవకాశాలు ఉంటాయన్నా, గోషామహల్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది అంటున్నా ఇదే కారణం.
ఈ రెండు ప్రాంతాల సీట్లపై ఎవరి ధీమా వారిది
పూర్తి మెజారిటీపై కాంగ్రెస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే వాళ్లు ఏడాది కాలానికి పైగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చేసిన పోరాట ఫలితం ఎగ్జిట్‌పోల్స్ అంచనాల్లో కనిపించింది. కానీ ఎగ్జిట్‌పోల్స్‌ను పట్టించుకోవద్దు, ఆగం కావొద్దు మళ్లీ మనమే వస్తున్నామని కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలకు చెప్పడానికి కారణాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలకు పైగా గెలుచుకుని పూర్తి మెజారిటీ దక్కించుకుంటుందని, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలలో స్వీప్ చేస్తుందని ఈ రెండు ప్రాంతాల్లోనే ఆపార్టీకి 45 పైగా సీట్లు వస్తాయని చాలా ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. ఈ రెండు చోట్ల బీఆర్‌ఎస్ 15-17 సీట్లకే పరిమితమౌతుందని అంచనా వేశాయి. వీటిపైనే పార్టీల అంచనాలే కాదు కొన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తేడా కొడుతున్నాయి.
ఇక్కడ బీఆర్‌ఎస్‌కు సీట్లు చాలా తగ్గినా 20కి పైగా వస్తాయని అంటున్నాయి. అలాగే బీజేపీ 4-8 సీట్లే గెలుచుకుంటుదని, ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమౌతుందని అన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. కానీ ఆ పార్టీకి పెరిగిన ఓటింగ్ శాతం కూడా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలను కలవరపరుస్తున్నది. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో అ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అంటున్నది. ఇక్కడ ఆపార్టీ గెలుస్తుందా? ఓడుతుందా? అన్నది పక్కనపెడితే గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడం, కొత్త ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడం, వాళ్లలో ఎక్కువ శాతంమంది బీజేపీకే జై కొట్టారనే చర్చ జరుగుతుండటం వంటివి ఫలితాలను తారుమారు చేయవచ్చు అంటున్నారు.
ఎన్నికల ప్రచారం నుంచి మొదలైన కాంగ్రెస్ వైపు గాలి వాస్తవమే అని తేలింది. అది మెజారిటీ మార్క్‌ను దాటుంతుందని కొన్ని, దగ్గరిదాకా వెళ్తుందని మరికొన్ని సర్వేల సంస్థల సారాంశం. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే బీఆర్‌ఎస్ ఓడిపోతున్నది. కాంగ్రెస్ మెజారిటీ మార్క్‌కు చేరువలో ఉన్నది. ఇప్పటివరకు వెల్లడైన ప్రీపోల్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెల్లడవుతాయా? లేక వాటన్నింటినీ పక్కకు నెట్టేసి బీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగానే నిలువబోతున్నదా? అనేది వేచి చూడాలి. బీజేపీ రాజకీయాలను చూసి కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పునే తెలంగాణ ప్రజలు పునరావృతం చేస్తారన్నది మరికొంతమంది అభిప్రాయం.