అధికారంలోకి రావాలా? వద్దా?.. కాంగ్రెస్ సీనియర్లపై ఠాక్రే సీరియస్!
రాహుల్ సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి అందుకు మీరు చేసిందేంటో చెప్పండి బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి మీ కృషి ఏంటి? మీ మీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? సీనియర్లపై మాణిక్‌రావు ఠాక్రే ప్రశ్నల వర్షం విధాత: రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చడానికి బూత్ స్థాయిలో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మానిక్‌రావు ఠాక్రే రాష్ట్ర పార్టీ నేతలను ప్రశ్నించారు. బుధవారం రాత్రి […]

- రాహుల్ సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి
- అందుకు మీరు చేసిందేంటో చెప్పండి
- బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి మీ కృషి ఏంటి?
- మీ మీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి?
- సీనియర్లపై మాణిక్‌రావు ఠాక్రే ప్రశ్నల వర్షం
విధాత: రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చడానికి బూత్ స్థాయిలో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మానిక్‌రావు ఠాక్రే రాష్ట్ర పార్టీ నేతలను ప్రశ్నించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఠాక్రే.. గురు, శుక్రవారాలలో పలువురు పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలపై ఠాక్రే కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చడానికి సీనియర్ నేతలుగా మీరు తీసుకున్న కార్యక్రమాలు ఏమిటి? ‘మీకు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఉందా? లేదా?’, పార్టీని అధికారంలోకి తేవడానికి మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఈగోలకు పోయి మేం సీనియర్లం.. అంటే ఓట్లేస్తారా? అని నిలదీసినట్లు తెలుస్తోంది.
ఇప్పడు సీనియర్లమని చెబుతున్న మీరంతా 2018లో పార్టీని ఎందుకు అధికారంలోకి తేలేకపోయారని ప్రశ్నించడంతో సదరు సీనియర్లు మౌనం దాల్చినట్లు తెలిసింది. జరిగిందేదో జరిగింది.. ఇప్పడు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మీ వంతుగా మీరు చేయబోయేది ఏంటో చెప్పాలని కోరారని సమాచారం.
- ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయరేం?
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన తరువాత రైతుల సమస్యలు రెట్టింపు అయ్యాయి. కరెంటు కోతలు పెరిగాయి. ఏసీడీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మంచడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి, ఎండ గట్టడంలో మీరు చేసిన కృషి ఏమిటని ఠాక్రే సీనియర్ నేతలను అడిగారని సమాచారం.
ముందుగా ప్రభుత్వ వైఫల్యాలపై మీ పోరాటాన్ని ఉధృతం చేయాలని, బూత్ స్థాయిలో ప్రతి ఇంటికీ రాహుల్ సందేశాన్ని తీసుకు వెళ్లాలని చెప్పిన ఠాక్రే.. ముందుగా మీమీ నియోజకవర్గాల్లో గెలిచేందుకు కృషి చేయాలని హితవు చెప్పారని సమాచారం.
బూత్ స్థాయిలో మీ కార్యక్రమాలేంటి?
మీరు చేపట్టిన కార్యక్రమాలేంటి? వాటిలో సాధించిన ప్రగతి ఏంటి? అని ప్రతి నాయకుడి నుంచి ప్రోగ్రెస్‌ను ఠాక్రే అడిగి తెలుసుకుని బూత్ స్థాయిలో కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర మినహా సీనియర్ నేతలైన మీరు ఎందుకు హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టలేదని అడిగినట్లు తెలిసింది.
నాయకులు ఏవేవో మాటలు చెప్పబోయినా.. వారించిన ఠాక్రే ముందుగా మీరు చేపట్టే కార్యక్రమం ఏమిటో తెలియజేయాలని సూటిగా అడిగారని సమాచారం. దీంతో చేసేదేమీ లేక ఠాక్రేను కలిసిన నాయకులంతా తాము కూడా యాత్రలు చేస్తామని చెప్పారని తెలిసింది. మార్చి నుంచే యాత్రలకు బయలుదేరుతామని హామీలు ఇచ్చారని సమాచారం.
కోమటిరెడ్డి ఇష్యూని అధిష్ఠానం చూసుకుంటుంది
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌గానే ఉన్నదని సమాచారం. దీంతో తాను అలా అనలేదని సాయంత్రానికే ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆ వివరణ పైనా అధిష్ఠానం సంతృప్తి చెందలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఠాక్రేను సీనియర్లు కోరారని, అయితే ఆ విషయం అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన చెప్పారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయాలు వదిలేసి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.