హ‌నీమూన్ తెచ్చిన తంటా.. అయోధ్య‌కు తీసుకెళ్ల‌లేద‌ని విడాకులు

ప్ర‌స్తుత కాలంలో నూత‌న వ‌ధూవ‌రులంద‌రూ హ‌నీమూన్ ట్రిప్‌కు వెళ్తున్నారు.

హ‌నీమూన్ తెచ్చిన తంటా.. అయోధ్య‌కు తీసుకెళ్ల‌లేద‌ని విడాకులు

భోపాల్ : ప్ర‌స్తుత కాలంలో నూత‌న వ‌ధూవ‌రులంద‌రూ హ‌నీమూన్ ట్రిప్‌కు వెళ్తున్నారు. ఇది ఇండియాలో సాధార‌ణ‌మైపోయింది. వీలైతే విదేశాల‌కు లేదంటే ఇండియాలోనే ఏదో ఒక ప్ర‌దేశానికి హనీమూన్‌కు ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఓ భ‌ర్త కూడా త‌న భార్యను హ‌నీమూన్‌కు గోవాకు తీసుకెళ్తాన‌ని హామీ ఇచ్చాడు. కానీ అయోధ్య‌కు తీసుకెళ్ల‌డంతో భార్య తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. దీంతో విడాకులు కావాల‌ని ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించింది. 

వివ‌రాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు చెందిన ఓ జంట‌కు 2023, ఆగ‌స్టులో వివాహ‌మైంది. భ‌ర్త‌నేమో ఐటీ ఉద్యోగి. భార్య ఇంట్లోనే ఉంటోంది. అయితే పెళ్లైన నాటి నుంచి హ‌నీమూన్‌కు వెళ్ల‌లేదు. దీంతో విదేశాల‌కు వెళ్లేందుకు భార్య ప్లాన్ చేసింది. కానీ భ‌ర్త తిర‌స్క‌రించాడు. ఇద్ద‌రం విదేశాల‌కు వెళ్తే పేరెంట్స్‌ను చూసుకునే వారు ఎవ‌రూ లేర‌ని చెప్పి, గోవా వెళ్దామ‌ని భ‌ర్త చెప్పాడు. దీంతో భార్య కూడా అంగీక‌రించింది. 

అయితే అయోధ్య‌లో రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ నేప‌థ్యంలో అక్క‌డికి వెళ్లాల‌ని కుమారుడికి త‌ల్లి సూచించింది. దీంతో భార్య‌కు తెలియ‌కుండా భ‌ర్త అయోధ్య‌కు విమాన టికెట్లు బుక్ చేశాడు. వారి ప్ర‌యాణానికి ఒక‌రోజు ముందు మాత్ర‌మే అయోధ్య‌కు వెళ్తున్న‌ట్లు భార్య‌కు తెలిసింది. మొత్తానికి భ‌ర్త వెంట భార్య కూడా అయోధ్య ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. 

ఇంటికి తిరిగొచ్చాక ఆమె తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. హ‌నీమూన్‌కు గోవా తీసుకెళ్ల‌కుండా, అయోధ్య‌కు తీసుకెళ్ల‌డాన్ని ఆమె జీర్ణించుకోలేక‌పోయింది. త‌న‌కు త‌న భర్త నుంచి విడాకులు కావాల‌ని కోరుతూ నిన్న ఫ్యామిలీ కోర్టును ఆమె ఆశ్ర‌యించారు. త‌న కంటే కుటుంబ స‌భ్యుల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు భ‌ర్త‌పై ఫిర్యాదు చేసింది.