అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటాలి..గవర్నర్ తమిళి సై పిలుపు

మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటేందుకు కృషి చేయాలని గవర్నర్ తమిళి సై పిలుపునిచ్చారు

  • Publish Date - March 6, 2024 / 12:24 PM IST

విధాత, హైదరాబాద్‌ : మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటేందుకు కృషి చేయాలని గవర్నర్ తమిళి సై పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలానీ కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో బుధవారం ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హాజరయ్యారు. మహిళా దినోత్సవం ఒక్క రోజు మహిళలను గౌరవించుకోవడానికి పరిమితం కావద్దని, నిత్యం మహిళలను గౌరవించే పరిస్థితులు ఉండాలని ఆకాంక్షించారు. విద్య, ఉద్యోగ పరంగా, రాజ్యంగ పరంగా, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలతో మహిళలు వివిధ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నించాలని సూచించారు. మహిళా సాధికారికతతోనే సమాజం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రం అమలు చేయనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయ, సామాజిక రంగాల్లో నిర్ణయాత్మక మార్పుకు దోహదం చేయనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా బిట్స్ పిలానీ కళాశాలలో వి ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మిటన్ ప్లేయర్ సైనా సెహ్వాల్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్, బాలీవుడ్ నటి, మోటివేషనల్ స్పీకర్ తానాజ్ ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ సోషలిస్ట్, ఫిట్నెస్, కాన్షియస్ లివింగ్ ఇన్ఫ్లుయెన్సర్ శిల్పా రెడ్డి పాల్గొన్నారు