బాత్‌రూమ్‌లో చెస్‌ చాంపియన్‌ పాడుపని.. మరి సస్పెండ్‌ చేయరా?

చైనీస్‌ చెస్‌ నేషనల్‌ చాంపియన్‌.. తన దుష్ప్రవర్తన కారణంగా టైటిల్‌ను కోల్పోయాడు.. ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు.

బాత్‌రూమ్‌లో చెస్‌ చాంపియన్‌ పాడుపని.. మరి సస్పెండ్‌ చేయరా?

ఆసియా ఖండంలో చైనీస్‌ చెస్‌ అనేది ఎంతో జనాదరణ కలిగిన ఆట. సియాంగ్ఖీ అని కూడా పిలుస్తారు. అయితే.. ఈ ఆటలో చాంపియన్‌గా నిలిచిన ఒక ఆటగాడిని అతడి దారుణ ప్రవర్తన కారణంగా టోర్నమెంట్‌ నిర్వాహకులు అనర్హుడిగా ప్రకటించి.. ఏడాదిపాటు చెస్‌ ఆడకుండా సస్పెండ్‌ చేశారు. యాన్‌ చెంగ్లాంగ్‌ అనే ఆటగాడు కొద్ది రోజుల క్రితం చైనా ద్వీపం నగరం హాయినన్‌లో చైనీస్ సియాంగ్ఖీ అసోసియేషన్‌ (సీఎక్స్‌ఏ) నిర్వహించిన ‘సియాంగ్ఘీ కింగ్‌’ నేషనల్‌ టోర్నమెంట్‌ విజేతగా నిలిచాడు.


ఆ విజయాన్ని తన స్నేహితులతో హోటల్‌ రూమ్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అంతా పీకలదాకా మద్యం తాగారు. మద్యం మత్తులో హోటల్‌ గదిలోని బాత్‌టబ్‌లోనే మలవిసర్జన చేశాడు. దీనిపై సదరు హోటల్‌ నిర్వాహకులు సీఎక్స్‌ఏకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సీఎక్స్‌ఏ నిర్వాహకులు.. హోటల్‌ ప్రాపర్టీని డామేజ్‌ చేసినందుకు, అనైతిక ప్రవర్తన, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.


ఆటలో కూడా వైర్‌లెస్‌ ఎక్విప్‌మెంట్‌లు వాడి ఆయన మోసం చేశారన్న ఆరోపణలు కూడా సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. వీటిపైనా సీఎక్స్‌ఏ మాట్లాడాల్సి వచ్చింది. అయితే.. దాన్ని రుజువు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. అయితే.. అతని చెడు ప్రవర్తన కారణంగా టైటిల్‌ను వాపస్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఏడాదిపాటు ఆయన చెస్‌ ఆడకూడదంటూ నిషేధించింది. ఈ ఆటలో విజేతగా నిలిచినందుకు అంతకు ముందు యాన్‌ చెంగ్లాంగ్‌కు ఎంత క్యాష్‌ ప్రైజ్‌ ముట్టిందనేది నిర్వాహకులు వెల్లడించలేదు. కానీ.. ప్రైజ్‌ మనీ వందల డాలర్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.