YS JAGAN | CM జగన్‌కు.. వచ్చే ఎన్నికల్లో మూడినట్టేనా!

YS JAGAN ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్షం ఎత్తులు బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ ఇటీవల మోదీపై ప్రశంసలు చంద్రబాబు కురిపించిన మోదీ అభివృద్ధి విధానంతో ఏకీభవిస్తున్నానన్న బాబు ఇప్పటికే బీజేపీకి దగ్గరైన పవన్‌ కల్యాణ్‌ జనసేన వైఎస్‌ఆర్‌సీపీకి రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులే? విధాత: వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గడ్డుకాలమేనా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇప్పటిదాకా టీడీపీ, జనసేన విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి […]

  • By: Somu    latest    Apr 28, 2023 12:59 PM IST
YS JAGAN | CM జగన్‌కు.. వచ్చే ఎన్నికల్లో మూడినట్టేనా!

YS JAGAN

  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్షం ఎత్తులు
  • బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ
  • ఇటీవల మోదీపై ప్రశంసలు చంద్రబాబు కురిపించిన
  • మోదీ అభివృద్ధి విధానంతో ఏకీభవిస్తున్నానన్న బాబు
  • ఇప్పటికే బీజేపీకి దగ్గరైన పవన్‌ కల్యాణ్‌ జనసేన
  • వైఎస్‌ఆర్‌సీపీకి రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులే?

విధాత: వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గడ్డుకాలమేనా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇప్పటిదాకా టీడీపీ, జనసేన విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి జగన్‌ గట్టెక్కుతాడని భావించిన రాజకీయ పరిశీలకులు.. ఇప్పడు ఆ రెండూ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో జగన్‌కు ఇబ్బందికర వాతావరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇటీవలికాలంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు కురిపించిన ప్రశంసల వర్షం రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు సంకేతంగా పరిశీలకులు చూస్తున్నారు. జాతీయ మీడియా చానల్‌ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని, ప్రధాని తన విధానాలకు మరింత మెరుగుపెడితే.. 2050 నాటికి ప్రపంచంలో భారత్ అగ్ర స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ప్రధాని విజన్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. పనిలో పనిగా తాను ఎన్డీఏలో భాగస్వామి కావడం మ్యాటర్ కాదని తేల్చేశారు.

నిజానికి గత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడేందుకు ఒక ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు సైతం చక్రం తిప్పడానికి ప్రయత్నించారు. కానీ.. అది సఫలం కాలేదు. ఇప్పడు యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు.. మోదీని ఆకాశానికెత్తడం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తు కోసం బాబు ఆలోచిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ బీజేపీకి దగ్గరగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్‌ను ఓడించడమే తమ లక్ష్యంగా జనసేన పనిచేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్‌ చెప్పిన విషయం తెలిసిందే. వైసీపీ అక్రమాలను అరికట్టేందుకు ఎవరితోనైనా చేతులు కలుపుతానని స్పష్టం చేశారు కూడా. టీడీపీతో పొత్తుకు జనసేన ఇచ్చిన సంకేతంగా దీనిని చూస్తున్నారు.

టీడీపీతో పొత్తు కుదిరితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలీడ్‌గా విపక్షానికే లాభిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీతో ఒక అవగాహనకు కూడా పవన్‌ వచ్చారు. ఈ సమయంలో చంద్రబాబు చేసిన ప్రకటన రాబోయే పొత్తుపొడుపులపై పూర్తిస్థాయి స్పష్టతనిచ్చింది.

ఇది కార్యరూపం దాల్చితే జగన్‌కు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే.. బీజేపీ మాత్రం ఇంకా తన వైఖరిని బయటకు చెప్పడం లేదు. చంద్రబాబు పరోక్షంగా అందించిన స్నేహహస్తానని బీజేపీ అందుకుంటుందా? లేక ఎన్నికల నాటికి పరిస్థితుల్లో ఇతర మార్పులు ఏమైనా ఉంటాయా? అనేది ఆ సమయానికి మాత్రమే తేలుతుంది.