కాంగ్రెస్‌లో షర్మిల చేరికను తేలిగ్గా తీసుకున్న వైసీపీ మంత్రులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు తేలిగ్గా తీసుకున్నారు

విధాత : ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు తేలిగ్గా తీసుకున్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఏపీ రాజకీయాల్లో ఒరిగేదేమి లేదని, జగన్‌ను ఓడించే సత్తా ఎవరికి లేదని, ప్రజల దీవెనలు..దేవుడీ ఆశీస్సులు జగన్‌కే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల కాంగ్రెస్ చేరికపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ఏ పార్టీలో చేరడమన్నది ఆమె ఇష్టమన్నారు. ఆమె నిన్నటి వరకు తెలంగాణలో పార్టీని నడిపారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారని, భవిష్యత్‌లో ఏం మాట్లాడుతారో చూడాలని వ్యాఖ్యనించారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని వెల్లడించారు. టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ నాయకులంతా టీడీపీలోకి వచ్చేస్తారని చంద్రబాబు ఇప్పటివరకు గేట్లు ఎందుకు తెరవలేదని ఎద్దేవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో జాయిన్ అయితే ఆమె వెంట తాము ఎందుకు వెళ్తామని, తమ రాజకీయ భవిష్యత్‌ను ఎందుకు నాశనం చేసుకుంటామన్నారు. ఇకపోతే వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీ వైసీపీలో షర్మిలకు స్థానం లేకనే తెలంగాణలో పార్టీ పెట్టుకుందని , ఎవరు ఏ పార్టీలో చేరినా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని, ప్రజల దీవెనలు, దేవుడీ ఆశీస్సులు జగన్‌కు ఉంటాయని ధీమాను వ్యక్తం చేశారు.