Work-life Balence | హాస్పిటల్ బెడ్ ముందు ఏ ఉద్యోగం కూడా విలువైంది కాదు! సీఈవో చెప్పిన మాట!
మిశ్రా అనుభవం.. ప్రస్తుత పని పరిస్థితులలో ఊహించని ప్రమాదాలను హైలైట్ చేస్తున్నది. సుదీర్ఘ పని గంటలు, మితిమీరిన స్ట్రెస్, ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితులు నిశ్శబ్దంగా ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అవి సీరియస్ అయ్యేదాకా తెలియడం లేదు.

Work-life Balence | కాలంతో పరుగులు తీస్తూ పనిచేయాల్సి వస్తున్న వేళ.. చాలా మంది ఆరోగ్యానికి కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వేళ కాని వేళల్లో చేస్తున్న ఆఫీస్ పనితో బాడీ క్లాక్ మొత్తం మారిపోతున్నది. చాలా మంది ముప్పు బారిన పడిన తర్వాతగానీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తకు ఎదురైంది. హాస్పిటల్ బెడ్ ముందు ఏ ఉద్యోగం కూడా విలువైంది కాదని ఆయనకు అర్థమైంది. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని అమిత్ మిశ్రా అనే సీఈవో లింక్‌డిన్‌లో పంచుకున్నారు. రాత్రికి రాత్రే తన బీపీ 230 దాటిపోయిందని, ముక్కు వెంట రక్తం కారుతూనే ఉండగా ఐసీయూలో చేరాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
ఒక శనివారం తాను రొటీన్‌గా చేస్తున్నట్టు తన లాప్‌ట్యాప్‌పై పనిచేసుకుంటుంటే.. ఉన్నట్టుండి ముక్కు నుంచి రక్తం స్రవించడం మొదలైందని అమిత్ మిశ్రా తెలిపారు. తాను అపోలో హాస్పిటల్‌కు చేరుకునే సమయానికే ఎంతో రక్తం పోయిందని, రక్తస్రవాన్ని తాత్కాలికంగా ఆపడానికే ఎమర్జెన్సీ విభాగంలోని వైద్యులు 20 నిమిషాలపాటు శ్రమించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అయితే.. అదే సమయంలో వారికి నిర్ఘాంతపోయే విషయం ఒకటి తెలిసింది. అప్పటికే ఆయన బీపీ తీవ్ర స్థాయిలో 230 దగ్గర ఉన్నది. ‘వెంటనే నన్ను ఐసీయూకు షిఫ్ట్ చేశారు. అక్కడ నా బీపీని తగ్గించేందుకు వైద్యులు పోరాటమే చేయాల్సి వచ్చింది. రాత్రికి అంతా బాగుందని అనుకున్నాం. కానీ.. తెల్లారి ఉదయం నేను ఐసీయూలో నడుస్తుండగా ఉన్నట్టుండి మూర్ఛపోయాను’ అని అమిత్ మిశ్రా తన పోస్టులో పేర్కొన్నారు. ఈసీజీ, ఎల్‌ఎఫ్‌టీ, ఎఖో, కొలెస్ట్రాల్.. ఆఖరుకు యాంజియోగ్రఫీ వంటి అనేక పరీక్షలు చేసినా ఎందుకు ఒక్కసారిగా అంత బీపీ వచ్చిందనేందుకు కారణాలేమీ కనిపించలేదు.
ఆధునిక జీవితం.. వర్క్, లైఫ్ సమన్వయం
మిశ్రా అనుభవం.. ప్రస్తుత పని పరిస్థితులలో ఊహించని ప్రమాదాలను హైలైట్ చేస్తున్నది. సుదీర్ఘ పని గంటలు, మితిమీరిన స్ట్రెస్, ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితులు నిశ్శబ్దంగా ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అవి సీరియస్ అయ్యేదాకా తెలియడం లేదు. అమిత్ మిశ్రా అనుభవం ఆరోగ్యానికంటే పనికే ప్రాధాన్యం ఇచ్చే అనేక మంది వృత్తి నిపుణులకు మేలుకొలుపులాంటిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇదీ మిశ్రా చెప్పిన మాటలు
తన అనుభవం నుంచి నేర్చుకున్న కొన్ని గుణ పాఠాలను మిశ్రా తన పోస్టులో పంచుకున్నారు.
– మీ శరీరం ఎప్పుడూ స్పష్టమైన సంకేతాలను ఇవ్వదు. హై బీపీ, స్ట్రెస్ వంటి హైరిస్క్‌లు నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తాయి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
– పని ముఖ్యమైనదే కానీ ఆరోగ్యంపై రాజీ లేదు. చిన్న చిన్న సంకేతాలను ఇగ్నోర్ చేస్తే.. అవి తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తాయి.
– అత్యవసర పరిస్థితులకు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండటం మంచిది. మనకు సమీపంలో ఉన్న బెస్ట్ హాస్పిటల్ ఏమిటి? ఏదైనా సంక్షోభం వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో అవగాహన కలిగి ఉండాలి.
– వైద్య శాస్త్రం రహస్యాలు వైద్యశాస్త్రానికి ఉన్నాయి. అన్ని పరీక్షలూ చేసినా నా బీపీ ఒక్కసారిగా ఎందుకు పెరిగిందనేది తెలియరాలేదు. కనుక ముందస్తు ఆరోగ్య సంరక్షణ విధానాలు ముఖ్యం.
చివరిలో ఒక వాక్యంతో ఆయన తన పోస్టును ముగించారు. అది.. ‘మీరు కనుక ఇది చదువుతున్నట్టయితే.. మీ శరీరం చెప్పేది వినండి. నాకులాగా మేలుకొలుపు వచ్చేదాకా ఎదురుచూడకండి’..
మిశ్రా పోస్టుపై తీవ్ర చర్చలు
మిశ్రా పెట్టిన పోస్టుపై అనేక మంది అనేక విధాలుగా స్పందించారు. వర్క్‌ను, లైఫ్‌ను సమన్వయం చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కొంతమంది తమ అనుభవాలనూ పంచుకున్నారు.