గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి

- తరగతి గదిలోనే కుప్పకూలిన చిన్నారి
- హుటాహుటిన దవాఖానకు తరలింపు..
- అప్పటికే చనిపోయినట్టు వైద్యుల నిర్దారణ
విధాత: గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థిని క్లాస్‌రూమ్‌లోనే గుండెపోటుతో కన్నుమూసింది. రాజ్‌కోట్‌లోని జస్దాన్ తాలూకాకు చెందిన సాక్షి రాజోసర (15) అమ్రేలి పట్టణంలోని శాంతబా గజేరా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది.
రోజువారీగా శుక్రవారం కూడా పాఠశాలకు వచ్చింది. సాక్షి తన తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆమెను సమీప దవాఖానకు తరలించారు. అయితే, బాలిక అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
సాక్షి అకాల మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. విద్యార్థిని మృతితో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల చిన్నారులు కూడా గుండెపోటుతో చనిపోతున్నఘటనలు తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.