NARI 2025 report | అభద్రతాభావంలో 40 శాతం పట్టణ ప్రాంత మహిళలు!

NARI 2025 report | తమకు రక్షణ లేదని లేదా అభద్రతాభావంతో ఉన్నామని భారతదేశంలోని పట్టణ ప్రాంత మహిళల్లో 40 శాతం మంది అభిప్రాయపడుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్ అయిన గణాంకాలే. తమకు ఎదురైన సమస్యలను చెప్పుకోలేని మహిళలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య మరింతగా ఉండచ్చు. అన్ని రాష్ట్రాల్లోని 31 నగరాల నుంచి సేకరించిన గణాంకాలతో మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక (ఎన్ఏఆర్ఐ 2025) విడుదలైంది. ఈ సర్వేలో 12770 మంది మహిళల అభిప్రాయాల ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించారు. 2024లో తాము వేధింపులకు గురయ్యామని ఏడు శాతం మహిళలు పేర్కొన్నారు. వీరి వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉంటుంది. 2022 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలతో పోల్చితే ఇది వందశాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తున్నది. రోడ్లపై వెళుతుండగా వెకిలి చూపులు, ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు, తాకడం వంటివి ఇందులో ఉన్నాయి. తగిన మౌలిక సదుపాయాల లేమి, వీధుల్లో రాత్రిపూట సరైన వెలుతురు లేకపోవడం, తగినంతగా ప్రజారవాణా సదుపాయాలు లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. సర్వే నిర్వహించిన నగరాల్లో కోల్‌కతా, ఢిల్లీలో మహిళల భద్రత తీవ్ర సమస్యగా తేలింది.
ఇవన్నీ అధికారికంగా రికార్డ్ అయిన ఫిర్యాదుల ద్వారా తీసుకున్న లెక్కలేనని, ఇలా రిపోర్ట్ కాని ఘటనలు మరిన్ని ఉంటాయని ఎన్ఏఆర్ఐ 2025 నివేదిక పేర్కొంటున్నది. సామాజికంగా ఇబ్బందులు, తదుపరి మరిన్ని వేధింపులు ఉంటాయన్న భయంతో చాలా మంది మహిళలు తమకు ఎదురైన అనుభవాలను చెప్పటానికి ఇష్టపడటం లేదని తెలిపింది. తమకు ఎదురైన ఘటనలపై ఫిర్యాదు చేశామని 22 శాతం మంది మహిళలు మాత్రమే చెప్పారని నివేదిక పేర్కొన్నది. పని ప్రదేశాల్లో భద్రతతో కూడిన వాతావరణమే ఉన్నదని 91 శాతం మంది చెబుతున్నా.. ప్రతి పని ప్రదేశంలో లైంగిక నేరాల నివారణ విధానం (పీవోఎస్‌హెచ్) తప్పనిసరి అని చెబుతున్న చట్టాన్ని పాటిస్తున్నారో లేదో తెలియదని 53 శాతం మంది మహిళలు తెలిపారు.
కొహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఈటానగర్, ముంబై.. మహిళలకు అత్యంత భద్రమైన నగరాలుగా నివేదిక పేర్కొన్నది. పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీ అట్టడుగున ఉన్నాయి. కొహిమా, ఇతర టాప్‌లో ఉన్న నగరాల్లో బలమైన లింగ సమానత ఉండటమే కాకుండా.. పౌర సమాజ భాగస్వామ్యం, పోలీసింగ్, విమెన్ ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అట్టడుగున ఉన్న పాట్నా, జైపూర్ వంటి నగరాల్లో సంస్థాగతంగా బలహీనమైన ప్రతిస్పందన ఉంటున్నది. పితృస్వామిక భావనలు, పట్టణ మౌలిక సదుపాయాల్లో లేమి కనిపిస్తున్నది. మొత్తంగా ఆరు నుంచి పది శాతం మంది మహిళలు మాత్రమే తమ నగరాలు భద్రమైనవని చెబుతున్నారు. కానీ.. 40 శాతం మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నట్టు చెప్పారు. ప్రత్యేకించి రాత్రిపూట్లలో, ప్రజారవాణావ్యవస్థలో, వినోదం కోసం వెళ్లే ప్రాంతాల్లో ఈ పరిస్థితి తరచూ ఎదురవుతున్నదని తెలిపారు. విద్యా సంస్థల్లో 86 శాతం మంది భద్రంగానే ఉన్నామని చెబుతున్నా.. రాత్రిపూట, లేదా క్యాంపస్ వెలుపల పరిస్థితి మారిపోతున్నదని చెప్పారు. పొరుగువారి నుంచి అభద్రతాభావాన్ని ఎదుర్కొంటున్నామని 38 శాతం మంది చెప్పగా, 29 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థలో వేధింపులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రతి మూడు వేధింపు ఘటనల్లో ఒకరు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ లెక్కన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చాలా మిస్ అవుతున్నాయి.
హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ఈ నివేదికలో ప్రస్తావన లేదు. అయితే.. అవతార్ గ్రూప్ గత ఏడాది చేసిన సర్వేలో హైదరాబాద్ పది పాయింట్లకు గాను 6.95 పాయింట్లతో భద్రమైన నగరంగా నిలిచింది. బెంగళూరు మొదటిస్థానంలో నిలువగా, చెన్నై, ముంబై, హైదరాబాద్ పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ, గురుగ్రామ్, కోయంబత్తూరు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
పీవాల్యూ ఎనలిటిక్స్ రూపొందించిన, గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ అకడమిషియన్స్ (జీఐఏ) ప్రచురించిన ఈ నివేదికను జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిశోర్ రహత్కార్ విడుదల చేశారు. ‘మన నగరాల్లోని మహిళలకు సంబంధించిన భద్రతా పరమైన అంశాలను అర్థం చేసుకునే క్రమంలో ఎన్ఏఆర్ఐ 2025 నివేదిక విడుదల ముందుడుగు. జాతీయ మహిళా కమిషన్‌గా మా ప్రాధాన్యం ప్రతి మహిళ పని ప్రదేశంలో, బహిరంగ ప్రదేశాల్లో, ఆన్లైన్ వేదికల్లో భద్రంగా ఉండటమే’ అని రహత్కార్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. అభద్రతా భావంతో మహిళలను తమకు తాము పరిమితులు విధించుకోవాల్సి వస్తున్నదని, అది వారి వ్యక్తిగత ఎదుగుదలనే కాకుండా మొత్తం సమాజ ఎదుగుదలను పరిమితం చేస్తుందని ఆమె అన్నారు. ఈ నివేదికలోని అంశాలు ప్రభుత్వాలకు, కార్పొరేట్ కంపెనీలు, నగర సమాజాలకు మార్గదర్శకంగా ఉంటాయని, దీని ఆధారంగా మహిళల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని పీవాల్యూ అనలిటిక్స్ ఎండీ ప్రహ్లాదధ్ రౌత్ వ్యక్తం చేశారు.