Election Deposits | 7,194 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు.. రూ. 16.36 కోట్ల నష్టం..!
Election Deposits | 2024 సార్వత్రిక ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాలకు గానూ 8,360 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో 7,194 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అంటే పోటీ చేసిన వారిలో 86.1 శాతం మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. దీంతో డిపాజిట్లు గల్లంతైన అభ్యర్థులకు రూ. 16.36 కోట్ల నష్టం వాటిల్లింది.

Election Deposits | న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాలకు గానూ 8,360 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో 7,194 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అంటే పోటీ చేసిన వారిలో 86.1 శాతం మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. దీంతో డిపాజిట్లు గల్లంతైన అభ్యర్థులకు రూ. 16.36 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నగదంతా ఎన్నికల సంఘానికే చెల్లుతుంది. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. డిపాజిట్లు కోల్పోతే నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సమయంలో చెల్లించిన రుసుం కూడా తిరిగి ఇవ్వబడదు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఓపెన్ కేటగిరి అభ్యర్థులు రూ. 25 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ. 12500 డిపాజిట్ చేస్తారు.
డిపాజిట్ అంటే..?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫలితాల తర్వాత డిపాజిట్ రుసుం తిరిగి పొందాలంటే పోలైన ఓట్లలో ఆరో వంతు అంటే 16 శాతం ఓట్లు పొందడం తప్పనిసరి. లేదంటే నిర్దేశిత సమయం కంటే ముందే నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకుంటే సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే ఆ రుసుం ఎన్నికల సంఘానికే చెందుతుంది.
ఈసీ వద్ద ఉన్న సమాచారం మేరకు దేశంలో 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో 91,160 మందిలో 71,245 మంది డిపాజిట్లు కోల్పోయారు. 1957లో అత్యల్పంగా 130 మంది, 1996లో అత్యధికంగా 12,688 మందికి డిపాజిట్లు దక్కలేదు. 2019 ఎన్నికల్లో 610 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.