Air India Flight | గడగడ వణికించిన మరో ఎయిర్ఇండియా విమానం
గడగడ వణికించిన మరో ఎయిర్ఇండియా విమానం..అకస్మాత్తుగా 900 అడుగుల కిందకు జారిన ఫ్లైట్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణీకులు సురక్షితంగా వియన్నాలో ల్యాండింగ్

- అకస్మాత్తుగా 900 అడుగుల కిందకు జారిన ఫ్లైట్
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణీకులు
- సురక్షితంగా వియన్నాలో ల్యాండింగ్
- పైలట్ల ఉద్యోగాలు ఊస్ట్
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మరువకముందే, మరో భయానక ఘటన Air India విమానానికి తలెత్తింది. ఢిల్లీ నుండి వియన్నాకు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం గాల్లో 900 అడుగులు ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్ర ఉలిక్కిపాటు చోటుచేసుకుంది. పైలట్లు తక్షణమే డ్యూటీ నుండి తొలగించబడ్డారు. విమానానికి సంబంధించిన భద్రతా లోపాలపై డీజీసీఏ (DGCA) విచారణ ప్రారంభించింది.
జూన్ 14 తెల్లవారు జామున 2.56 గంటలకు ఢిల్లీ ఇండిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్‌ఇండియా బోయింగ్ 777 (ఫ్లైట్ AI-187) సుమారు 9 గంటల 8 నిమిషాల ప్రయాణానంతరం విజయవంతంగా వియన్నాలో ల్యాండైంది. అయితే టేకాఫ్ అనంతరం కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా 900 అడుగుల కిందకు జారడంతో అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. “డోంట్ సింక్” వంటి హెచ్చరికలు పదే పదే వినిపించాయి.
ఎయిర్‌ఇండియా అధికార ప్రతినిధి ప్రకారం, పైలట్లు వేగంగా స్పందించి విమానాన్ని నిలకడగా ఉంచగలిగారు. “ఈ ఘటనపై పైలట్లు నివేదిక సమర్పించిన వెంటనే, ప్రాథమిక సమాచారం డీజీసీఏకు అందించాం. బ్లాక్‌బాక్స్ డేటా అందిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలైంది. పైలట్లు ఇప్పటికే రోస్టర్ నుండి తొలగించబడ్డారు” అని తెలిపారు.
ఇక ఈ సంఘటన జూన్ 12న జరిగిన మరో ఘోర ప్రమాదం తర్వాత 38 గంటల వ్యవధిలోనే జరగడం గమనార్హం. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోగా, దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికే డీజీసీఏ నిర్వహించిన సురక్షితతా తనిఖీల్లో ఎయిర్‌ఇండియా విమానాల్లో యాంత్రిక లోపాలు, నిర్వహణా పరమైన విఫలతలు ఎక్కువగా నమోదయ్యాయి. వరుసగా సమస్యలు వెలుగులోకి రావడంతో, డీజీసీఏ గత వారం గూర్గావ్‌లోని ఎయిర్‌ఇండియా ప్రధాన కార్యాలయంలో విస్తృతమైన తనిఖీలు ప్రారంభించింది. ఇందులో ఆపరేషన్స్, ఫ్లైట్ ప్లానింగ్, షెడ్యూలింగ్, పైలట్ల రోస్టర్‌లతో పాటు ఐఓసీసీ (ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్) పనితీరును కూడా పరిశీలిస్తున్నారు.
ఈ తాజా సంఘటనల నేపథ్యంలో ఎయిర్‌ఇండియా లోపాలను తేల్చేందుకు మరింత కఠినమైన నిబంధనలతో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.