క్షమాపణలు అంగీకరించం.. పర్యవసానాలకు సిద్ధంకండి: బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు వార్నింగ్‌

కోర్టులతో పెట్టుకుంటే ఏమవుతుందో బాబా రాందేవ్‌కు, పతంజలి ఉత్పత్తుల కంపెనీకి బాగా తెలిసివచ్చింది.

  • Publish Date - April 5, 2024 / 04:36 PM IST

తప్పుడు వాణిజ్య ప్రకటనల కేసులో సుప్రీంకోర్టుకు హాజరైన బాబా రాందేవ్‌, బాలకృష్ణ తప్పయిపోయిందంటూ క్షమాపణలు తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం న్యూఢిల్లీ: కోర్టులతో పెట్టుకుంటే ఏమవుతుందో బాబా రాందేవ్‌కు, పతంజలి ఉత్పత్తుల కంపెనీకి బాగా తెలిసివచ్చింది. తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రాందేవ్‌, పతంజలి ఎండీ బాలకృష్ణ క్షమాపణ చెప్పేందుకు సిద్ధపడినా.. కోర్టు వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని మంగళవారం స్పష్టం చేసింది. వారి తరఫు న్యాయవాదులు పదే పదే తప్పయిపోయిందన్నా, తప్పులు జరిగాయని అంగీకరించినా.. కోర్టు ససేమిరా అన్నది.

ఏ చికిత్సా పద్ధతికి వ్యతిరేకంగా లేదా సదరు ఉత్పత్తి ఔషధ గుణాలపై ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయబోమని నవంబర్‌ 21, 2023న ఇచ్చిన హామీని ఉల్లంఘించిన పతంజలి ఆయుర్వేద్.. డిసెంబర్‌ 4, 2023న మరోసారి ప్రకటన విడుదల చేయడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా వారిద్దరికీ మొట్టికాయలు వేసిన జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాలతో కూడి ధర్మాసనం.. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జోక్యం చేసుకోవడంతో ఆఖరి అవకాశం ఇచ్చేందుకు అంగీకరించింది.

ఈ మేరకు బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన ధర్మాసనం.. తప్పును కంపెనీ మీడియా విభాగంపై పడేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి వివరణను అంగీకరించేందుకు మేం సిద్ధంగా లేమన్న జస్టిస్‌ హిమా కోహ్లి.. మీ మీడియా విభాగంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోలేక పోవడానికి అదేమన్నా ఎక్కడో మారుమూల విసిరేసినట్టు ఉన్నదా? అని ప్రశ్నించారు. మీ క్షమాపణ ఆమోదయోగ్యం కాదని, ఏదో నోటిమాటకు క్షమాపణ చెప్పినట్టు ఉన్నదని వ్యాఖ్యానించారు.

Tags:  

Latest News