క‌రోనాతో భ‌ర్త మృతి.. అత‌ని వీర్యంతో మ‌గ‌బిడ్డ‌కు జన్మ‌నిచ్చిన 48 ఏండ్ల మ‌హిళ‌

ఆ దంప‌తుల‌కు 27 ఏండ్ల క్రితం పెళ్లైంది. కానీ సంతానం క‌ల‌గ‌లేదు. సంతానం కోసం మొక్క‌ని దేవుడు లేడు.. తిర‌గ‌ని ఆస్ప‌త్రి లేదు

క‌రోనాతో భ‌ర్త మృతి.. అత‌ని వీర్యంతో మ‌గ‌బిడ్డ‌కు జన్మ‌నిచ్చిన 48 ఏండ్ల మ‌హిళ‌

కోల్‌క‌తా : ఆ దంప‌తుల‌కు 27 ఏండ్ల క్రితం పెళ్లైంది. కానీ సంతానం క‌ల‌గ‌లేదు. సంతానం కోసం మొక్క‌ని దేవుడు లేడు.. తిర‌గ‌ని ఆస్ప‌త్రి లేదు. అలా సంవ‌త్స‌రాల పాటు పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నించి, చివ‌ర‌కు ఐవీఎఫ్ మార్గాన్ని ఎంచుకున్నారు. అంత‌లోనే భ‌ర్తను క‌రోనా కాటేసింది. అప్ప‌టికే అత‌ని వీర్యాన్ని ల్యాబ్‌లో భ‌ద్ర‌ప‌ర‌చ‌డంతో.. ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో 48 ఏండ్ల వ‌యసులో పండంటి మ‌గ‌బిడ్డ‌కు జన్మ‌నిచ్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌కు చెందిన అరుణ్ ప్ర‌సాద్ కేస‌రి, సంగీత కేస‌రికి 27 ఏండ్ల క్రితం వివాహ‌మైంది. పెళ్లైన త‌ర్వాత పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నించారు. కానీ వారికి సంతానం క‌ల‌గ‌లేదు. చాలా కాలం త‌ర్వాత ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిని అనుస‌రించారు. ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న క్ర‌మంలోనే 2021లో క‌రోనాతో అరుణ్ చ‌నిపోయాడు.

అంత‌కు ముందే ఐవీఎఫ్ చికిత్స నిమిత్తం అరుణ్ వీర్యాన్ని సేక‌రించి, కోల్‌క‌తాలోని ఓ ల్యాబ్‌లో వైద్యులు భ‌ద్ర‌ప‌రిచారు. ఇక భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత ఆమెకు చీద‌రింపులు ఎక్కువ‌య్యాయి. కుటుంబ స‌భ్యులెవ‌రూ కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. అరుణ్ న‌డిపిన కిరాణం దుకాణాన్ని న‌డుపుతూ సంగీత జీవ‌నం సాగించింది.

అయితే భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఆమెను మ‌రింత ఒంట‌రి త‌నానికి గురైంది. ఇక భ‌ద్ర‌ప‌రిచిన త‌న భ‌ర్త వీర్యంతో పిల్ల‌ల‌ను క‌నాల‌నుకుంది. దీంతో మ‌ళ్లీ ఐవీఎఫ్ చికిత్స‌ను ఫాలో అయింది. ఎట్ట‌కేల‌కు ఆమె ప్ర‌య‌త్నం ఫ‌లించింది. 48 ఏండ్ల వ‌య‌సులో పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పుట్టిన శిశువు 2.5 కేజీల బ‌రువుతో ఆరోగ్యంగా ఉన్నాడ‌ని వైద్యులు తెలిపారు. క‌రోనా త‌న భ‌ర్త‌ను కాటేసిన‌ప్ప‌టికీ, త‌న‌కు ఇప్పుడు మ‌గ శిశువు జ‌న్మించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు సంగీత‌.