ప‌ట్ట ప‌గ‌లే.. బీఎండ‌బ్ల్యూ కారులో నుంచి రూ. 13 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లిన దొంగ‌లు

ప‌ట్ట ప‌గ‌లే.. బీఎండ‌బ్ల్యూ కారులో నుంచి రూ. 13 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లిన దొంగ‌లు

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలో ప‌ట్ట‌ప‌గ‌లే భారీ చోరీ జ‌రిగింది. నిలిపి ఉంచిన బీఎండ‌బ్ల్యూ కారులో ఉన్న రూ. 13.75 ల‌క్ష‌ల న‌గ‌దును ఇద్ద‌రు దొంగ‌లు ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

రూ. కోటి విలువ చేసే బీఎండ‌బ్ల్యూ ఎక్స్5 అనే కారును సోంపుర‌లోని స‌బ్ రిజిస్ట్రార్ వ‌ద్ద పార్కింగ్‌లో నిలిపి ఉంచారు. అయితే కారులో భారీగా న‌గ‌దు ఉంద‌న్న విష‌యాన్ని ఇద్ద‌రు వ్య‌క్తులు గ్ర‌హించారు. ఇక డ్రైవ‌ర్ వైపు ఉండే కారు అద్దాల‌ను ఓ వ్య‌క్తి క్ష‌ణాల్లో ప‌గుల‌గొట్టాడు. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా డ్రైవ‌ర్‌కు ఎడ‌మ వైపు ఉన్న సీట్లో ఉంచిన న‌గ‌దు క‌వ‌ర్‌తో ఉడాయించారు. అప్ప‌టికే బైక్‌పై రెడీగా ఉన్న వ్య‌క్తి, న‌గ‌దు తీసుకున్న వ్య‌క్తి క‌లిసి పారిపోయారు. 

ఈ ఘ‌ట‌న‌పై కారు య‌జ‌మాని బాబు సార్జాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. ఇద్ద‌రు దుండ‌గుల్లో ఒక‌రు హెల్మెట్ ధ‌రించ‌గా, మ‌రొక‌రు ఫేస్ క‌నిపించ‌కుండా మాస్కు ధ‌రించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.